నూకరాజుతో కలిసి ఉన్న నందిని (పాతచిత్రం)
సాక్షి, కాకినాడ : హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆ మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు సహజీవనం చేశారు. ఓ బిడ్డను కన్నారు. చివరికి ఆ యువతిని అతగాడు వంచించాడు. ‘ఎవడి దగ్గర బిడ్డను కన్నావంటూ అత్యంత అవమానకరంగా, నీచంగా మాట్లాడి, ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల ఆడ శిశువుతో ఆ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఆమె కథనం ప్రకారం..
హైదరాబాద్‌కు చెందిన కేసిరెడ్డి పాండు, లక్ష్మి దంపతుల కుమార్తె నందిని. ఆమెకు 2013లో వరంగల్‌కు చెందిన మేనమామతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో కొద్ది రోజులకే తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా ఓ ఇంట్లో పనికి చేరింది. 2016లో ఓ మొబైల్ షాపులో చేరింది. అదే సమయంలో కోటనందూరు మండలం ఎస్సార్ పేట గ్రామానికి చెందిన అన్నంరెడ్డి నూకరాజు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. నందినితో అతడు పరిచయం ఏర్పరచుకున్నాడు. నందిని పరిస్థితులు తెలుసుకున్న నూకరాజు పెళ్లి చేసుకుంటానని, తన దగ్గరకు వచ్చేయమని కోరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఆ మాటలు నమ్మి, అతడి వద్దకు చేరింది.
నెల రోజుల పసికందుతో బాధితురాలు నందిని
నందిని ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న నూకరాజు మోసపూరితంగా వ్యవహరించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు హైదరాబాద్‌లోని ఒక గుడిలో దండలు మార్చి, పెళ్లయ్యిందనిపించాడు. అలా సహజీవనం ప్రారంభించిన కొంత కాలానికి నందిని గర్భవతి అయ్యింది. దీంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడు. ఆ తరువాత మళ్లీ తన ఇంట్లో అందరి సమక్షంలోనూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మళ్లీ గర్భవతి కావడంతో రెండోసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నందిని తిరస్కరించింది. అప్పటి నుంచీ అల్లర్లు, గొడవలతో వారి జీవనం సాగేది.
ఈ నేపథ్యంలో ప్లేటు ఫిరాయించిన నూకరాజు ‘‘ఎవడి దగ్గర బిడ్డని కన్నావు? నిన్ను పెళ్లి చేసుకోను’’ అని నీచంగా మాట్లాడుతూ ముఖం చాటేశాడు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఎస్సార్ పేట వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నందిని ఆదివారం సాయంత్రం నెల రోజుల తన పసిబిడ్డతో ఎస్సార్ పేట చేరుకుంది. అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. నూకరాజు కుటుంబ సభ్యులు గెంటేయడంతో తన బిడ్డతో పక్కవారింట్లో తల దాచుకొంది. అయిన వారందరినీ కోల్పోయిన తాను నూకరాజుతోనే జీవిస్తానని, తనకు పుట్టిన బిడ్డకు నూకరాజే తండ్రని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. స్థానికుల సహకారంతో కోటనందూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి : నపుంసకునితో వివాహం చేశారని..
Comments
Please login to add a commentAdd a comment