బాలుడి సరదా ఆటతో ఆవిరైన తండ్రి కష్టం | Son Play Free Fire Online Game cyber Criminals Cheat 5Lakhs | Sakshi
Sakshi News home page

హానిలైన్‌ గేమ్‌!

Published Mon, Jul 13 2020 8:26 AM | Last Updated on Mon, Jul 13 2020 8:26 AM

Son Play Free Fire Online Game cyber Criminals Cheat 5Lakhs - Sakshi

అమలాపురం టౌన్‌: స్థానిక గణపతి థియేటర్‌ సమీపంలో ఓ బాలుడు సరదాగా తన తల్లి స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ఆడిన ఆన్‌లైన్‌ గేమ్‌తో రూ.5.40 లక్షల దోపిడీకి గురై ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి తల్లడిల్లుతోంది. ఆన్‌లైన్‌ గేమ్‌ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.లక్షలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు తన తల్లి స్మార్ట్‌ ఫోన్‌తో ఆన్‌లైన్‌ క్లాసుల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్‌లైన్‌ గేమ్‌ల్లోకి వెళ్లాడు. 20 రోజులుగా ఆ గేమ్‌లు ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్‌ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో వెపన్స్‌ కొనాలంటే ఫలానా లింక్‌ ఓపెన్‌ చేయమంటే అదీ కూడా ఓపెన్‌ చేశాడు. (అవకాశాలు అంత తేలికకాదు.. )

అందులో ఈ గేమ్‌ యాప్‌ నిర్వాహకులు తెలివిగా తొలుత ఆ వెపన్స్‌ రూ.వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా టైప్‌ చేసేశాడు. అలా ఒక్కసారి ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే మన బ్యాంక్‌ అకౌంట్ల విషయాలన్నీ అవతలి వారికి తెలిసే ప్రక్రియ అందులో ఉంటుంది. రూ.వందతో మొదలైన వెపన్స్‌ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంక్‌ల అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ.5.40 లక్షలు డ్రా అయ్యాయి. 20 రోజుల్లో రోజుకు కొంత మొత్తం వంతున అంతా ఆన్‌లైన్‌ మోసంతో కొల్లగొట్టేశారు. తల్లి ఏదో అవసరం పడి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్‌ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్‌ ఫోన్‌కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్‌ చూపడంతో తల్లి కంగారు పడింది.

తర్వాత రెండు బ్యాంక్‌లకు వెళ్లి ఆరా తీస్తే రెండు అకౌంట్లలో డబ్బులన్నీ డ్రా అయినట్టు చెప్పడంతో ఆమెకు చెమటలు పట్టాయి. పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో ఆదివారం ఉదయం విచారించారు. అయితే గేమ్‌ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్‌ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నా అవి గజిబిజిగా ఉండడంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఓటీపీ ఇవ్వడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్‌లు రావడంతో పోలీసులు ఈ కేసు సైబర్‌ నేరం కింద వస్తుందా? రాదా? అనే దానిపై సైబర్‌ నేరాల నిపుణలతో సంప్రదిస్తున్నారు. ఆమె భర్త కువైట్‌లో ఉంటూ తాను అక్కడ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్‌లో వేస్తే తమ కొడుకు సరదాగా ఆడిన ఆట ఆ కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసింది. పరాయి దేశంలో తన కుటుంబ కోసం శ్రమకోర్చి సమకూర్చుకున్న ఆదాయం ఇక్కడ అన్‌లైన్‌ మోసంతో ఆవిరైపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement