వ్యభిచార ముఠా గుట్టు రట్టు | Prostitution Scandal Reveals in East Godavari | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Published Fri, May 15 2020 1:23 PM | Last Updated on Fri, May 15 2020 1:23 PM

Prostitution Scandal Reveals in East Godavari - Sakshi

ముఠా వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భీమారావు. చిత్రంలో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయబాబు

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌: నగర శివారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను తిమ్మాపురం పోలీసులు రట్టు చేశారు. తిమ్మాపురం పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్‌ రాజేష్‌ల ద్వారా అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

దీనిపై సమాచారం అందడంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయ్‌కుమార్, సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. నిందితుల్లో ఏజెంట్‌ రాజేష్, కొటికలపూడి రాజు, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్, కొత్తపల్లికి చెందిన అప్పాజీ, కరపకు చెందిన పెంకే శ్రీనుబాబు, విటులు పంపన రాముడు, దబరిక సూరిబాబు ఉన్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు రాజేష్‌తో పాటు సతీష్, అప్పాజీలు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని, బెంగళూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాధితులుగా గుర్తించి నాలుగో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పరిచారు. వారి ఉత్తర్వుల ప్రకారం ఆ అమ్మాయిలను ప్రొటెక్షన్‌ హోమ్‌కు పంపుతామని డీఎస్పీ తెలిపారు. వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, సూర్యచంద్ర, మొహిద్దీన్, శిరీష, ఐడీ పార్టీ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, రవికుమార్, నారాయణరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement