10 నియోజక వర్గాల్లో షర్మిల బస్సు యాత్ర
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుంది. తూర్పు గోదావరి జిల్లా తుని మీదుగా సాయంత్రం 4 గంటలకు పాయకరావుపేటకు చేరుకుని అక్కడే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. సమైక్యాంధ్రకు జై కొడుతూ షర్మిలకు జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ,పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు,నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావులతో పాటు పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాయకరావుపేట సభ ముగిశాక రాత్రికి నక్కపల్లి సమీపంలో బస చేసి షర్మిల ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయల్దేరి విశాఖ నగరానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జగదాంబ సెంటర్‌లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం జిల్లా యాత్రకు బయల్దేరతారు. పాయకరావుపేటలో జిల్లాలోకి ప్రవేశించే షర్మిల బస్సు యాత్ర యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణ, తూర్పు , భీమిలి నియోజక వర్గాల మీదుగా విజయనగరం జిల్లాలోకి వెళుతుంది.
చురుగ్గా ఏర్పాట్లు
పాయకరావుపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమైక్యశంఖారావానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి బస్సు యాత్ర తాండవ బ్రిడ్జి ప్రాంతం నుంచి ఎల్‌టి కాలనీ, నాగరాజుపేట రైల్వేగేటు, గౌతమ్ సెంటరు మీదుగా చిత్ర మందిర్ సెంటరు వద్ద జరిగే బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటుంది. షర్మిలకు స్వాగతం పలుకుతూ అంతటా భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల ప్లెక్సీలు పెట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. దీనికి షర్మిల పూలమాల వేస్తారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చిత్ర మందిర్ సెంటరులో జరిగే బహిరంగసభలో బస్సు పైనుంచే షర్మిల ప్రసంగిస్తారు. అటు గౌతమ్ సెంటరు, ఇటు పంచాయతీ కార్యాలయం వైపు వేలాది మందికి షర్మిల కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు
.
యాత్ర విజయవంతం కావాలి: కొణతాల
షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో బస్సు యాత్రకు సంబంధించి రూట్‌తోపాటు,బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. రోడ్డు కిరువైపులా బారికేడ్లు,స్వాగత ద్వారాలు ఏర్పాటు,బహిరంగ సభ నిర్వహణపై నాయుకులకు సూచనలిచ్చారు.
అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్రకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయలకు అతీతంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నియోజక వర్గ సమన్వయకర్తలు చెంగల వెంకట్రావు, గండి బాబ్జీ,బొడ్డేడప్రసాద్, పార్టీ నాయుకులు వీసం రామకృష్ణ, ధనిశెట్టి బాబూరావు,చిక్కాల రామారావు,జానకి శ్రీను, బొలిశెట్టి గోవిందు, ఆడారి ప్రసాద్, కోడా కోటేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, ఆడారి నూకరాజు, దేవవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.