=9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
=ఏఓ, ఏఏఓల నియామకానికి జేడీకి లేఖ
=96,697 హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు
=వరదలు కారణంగా 16 వేల హెక్టార్లలో నష్టం
=దిగుబడిపై రైతుల ఆందోళన
రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని లెవీ సేకరణ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది.. ఖరీఫ్ వరి కొనుగోలుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ధాన్యం నాణ్యత విషయంలో కొనుగోలు అధికారులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఏటా లెవీ సేకరణ నిరాశాజనకంగా సాగుతోంది. తేమ శాతం ఎక్కువన్న కారణంపై అనేక సందర్భాల్లో అధికారులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తూ ఉండడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని కర్షకులు నిరాశ పడుతున్నారు. అందుకే ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మళ్లీ లేవీ సేకరణకు పౌర సరఫరా అధికారులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ వరి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం నాణ్యతను అంచనా వేయడానికి, కొనుగోలుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి టెక్నికల్ సిబ్బందిని నియమించనున్నారు. పదేళ్లుగా జిల్లాలో లెవీ సేకరణ నామమాత్రంగానే సాగుతోంది. ప్రతీ సీజన్‌లోనూ వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు రైతులను తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దాంతో ధాన్యం కొనుగోలుకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నా యి. తేమ సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తూ ఉండడంతో సమస్య వస్తోంది. నాణ్యత పేరుతో అసలు కొనుగోలుకే విముఖత చూపిస్తుండడంతో జిల్లాలో పెద్దగా లెవీ సేకరణ జరగడం లేదు.
9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
లేవీ సేకరణకు సంబంధించి జిల్లాకు ఎటువంటి లక్ష్యం లేదు. అయినా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనువుగా జిల్లాలో 9 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట, చింతపల్లి, పాడేరు, అరకు మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ తొమ్మిది కేంద్రాల్లో 9 మంది వంతున వ్యవసాయాధికారులను, 9 మంది సహాయ వ్యవసాయాధికారులను నియమించాలని పౌర సరఫరా అధికారులు వ్యవసాయ శాఖకు లేఖ రాశారు. వీరికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు.
నామమాత్రంగా కొనుగోలు: ప్రభుత్వ నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు రైతులు ముందుకు రావడం లేదు. తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధరకు అడుగుతున్నారు. నాణ్యత లేదని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. అందుకే వారు ధాన్యాన్ని మిల్లర్లకు నేరుగా విక్రయిస్తున్నారు. గత ఏడాది ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. గత పదేళ్లలో 2010 సంవత్సరంలో మాత్రమే అత్యధికంగా 200 టన్నులను ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా మరో నెల రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులు ఈ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పంట నష్టపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్న రైతులు మిల్లర్లను ఆశ్రయించే అవకాశమే అధికంగా కనిపిస్తోంది.
లెవీ తంతు
Published Thu, Dec 5 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement