రోడ్డు ప్రమాద కేసును పరిశీలిస్తున్న పోలీసులకు.. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడింది.
పాయకరావుపేట :రోడ్డు ప్రమాద కేసును పరిశీలిస్తున్న పోలీసులకు.. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడింది. దీనికి సంబంధించి కోరంగి పోలీసులు మంగళవారం పాయక రావుపేటలో విచారణ జరిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడలో మునసబుగారి వీధికి చెందిన పెమ్మాడ ధనలక్ష్మి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఉంది.
పెమ్మాడ ధనలక్ష్మికి పెమ్మాడ వెంకటరమణ(వెంకట్), రమేష్, శివవరప్రసాద్ (రాజు)అనే ముగ్గురు కొడుకులున్నారు. తమ తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సూర్యనారాయణను మట్టు పెట్టేందుకు తమమేనత్త కొడుకు బొమ్మిటి వీరమణికంఠతో కలసి పథకం వేశారు. సూర్యనారాయణను చంపేసి పాయకరావుపేట తాండవ సుగర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న తన మేనత్త రామలక్ష్మి ఇంటిలో పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకినాడకు చెందిన శివ అనే కారుడ్రైవర్‌తో కలసి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
దీనిలో భాగంగా వాసంశెట్టి సూర్యనారాయణను ఈనెల 8న డ్రైవర్ శివ, పెమ్మాడ వెంకటరమణ కారులో యానాం తీసుకువెళ్లి పూటుగా తాగించారు. అతడితో పాటు డ్రైవర్ శివ పూటుగా తాగాడు. కారులో రాత్రి తిరుగు ప్రయాణమైన వారి కోసం తాళ్లరేవు మండలం లచ్చిపాలెం జాతీయ రహదారిపై పెమ్మాడ శివప్రసాద్, బొమ్మిటి వీరమణికంఠ బైక్‌పై వేచి ఉన్నారు. డ్రైవర్ శివ పూటు తాగి ఉండడంతో కారు అదుపు తప్పి వీరిద్దరినీ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెమ్మాడ శివప్రసాద్, బొమ్మిటి వీరమణికంఠ దుర్మరణం చెందారు.
దీనిపై అప్పుడు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో హత్య చేసేందుకు వేసిన పథకం అమలు చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. కాకినాడ రూర ల్ సీఐ పవన్ కిషోర్, కోరింగి ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తాండవ సుగర్స్‌లో రామలక్ష్మి ఉంటున్న క్వార్టర్స్‌ను తనిఖీ నిర్వహించారు. ఇంటిలో పెద్ద గొయ్యి తవ్వి ఉంది. హత్యచేసి, పూడ్చిపెట్టేందుకు వేసిన పథకంలో భాగంగా ఈ గొయ్యి తవ్వారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రామలక్ష్మి పరారీలో ఉంది.