
పంచాయతీలో లంచావతారం
► ప్లాన్ అప్రూవల్‌కు లంచం డిమాండ్ చేసిన కార్యదర్శి
► ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
► రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
విజయనగరం టౌన్: ఇంటి నిర్మాణానికి అనుమతికోసం లంచం డిమాండ్‌చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండలంలోని చెల్లూరు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చెల్లూరు పంచాయతీ పరిధిలో రామ్‌నగర్ లే అవుట్ ఉంది. అందులో ప్లాట్ కలిగిన రౌతు కిరణ్ అనే వ్యక్తి తన భార్య పేరున ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అనుమతులు మంజూరు చేయడంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శి వి.సత్యనారాయణ తాత్సారం చేస్తూ వచ్చారు. అనేకమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన కిరణ్‌కు ఆయన రూ. 15వేలు లంచం ఇస్తే ప్లాన్ అప్రూవల్ ఇస్తానని తెగేసి చెప్పారు. ఇక విసిగెత్తిపోయిన బాధితుడు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన డీఎస్పీ షకీలాభాను ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం తాము అందించిన ఏడు రెండువేల నోట్లు, రెండు ఐదువందల నోట్లు కిరణ్‌ద్వారా పంచాయతీ కార్యదర్శికి అందిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టి, రికార్డులు సీజ్ చేశారు. కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.
ఈ ఏడాదిలో ఇది ఏడో కేసు
అవినీతిపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏడుకేసులు నమోదయ్యాయి. చిన్నదా, పెద్దదా అనేది కాకుండా ఏసీబీకి ఫిర్యాదు చేస్తుండటంతో ఎక్కడికక్కడే లంచావతారాల్ని ట్రాప్ చేసి పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ విజయనగరం మున్సిపల్ ఆర్‌ఐ, సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి, కురుపాం విద్యుత్ శాఖ ఏఈ, జియ్యమ్మవలస తహశీల్దార్, పార్వతీపురం కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ, డెంకాడ మండలం మోపాడ వీఆర్‌ఓ ఏసీబీ వలలో చిక్కారు. తాజాగా పంచాయతీరాజ్‌కి చెందిన చెల్లూరు పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ షకీలాభాను విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. నేరుగా కార్యాలయానికి వచ్చి పిర్యాదుచేస్తే, బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామనీ, అవినీతిపరుల భరతం పడతామని తెలిపారు.