ధర్పల్లి: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్‌పీ సంజీవరావు కథనం ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన అస్రఫ్‌బీ భర్త అజీజ్ జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. ఆయన తండ్రి గోరేమియా చనిపోవడంతో ముగ్గురు కొడుకులు వేరుపడ్డారు. ఈ క్రమంలో తన భర్త వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని అజీజ్ పేరు మీదికి మార్చేందుకు అతడి భార్య అస్రఫ్‌బీ సెప్టెంబర్ 9న పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది.
కాగా పేరు మార్పిడి కోసం ఆమెను పంచాయతీ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్న కార్యదర్శి సంధ్యారాణి చివరికి రూ. 6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితురాలు తొలుత రూ. 2 వేలు ఇస్తానంది. ఈ నెల 17న రూ. 4 వేలకు ఇద్దరి మధ్య బేరం కుదిరింది. అయితే బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. బుధవారం ఉదయం 10.30 గంటల వరకు డబ్బులు ఇవ్వాలని కార్యదర్శి కోరగా ఆ ప్రకారం అస్రఫ్‌బీ రూ.4 వేలు పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి ఇచ్చింది.
డబ్బులను కార్యదర్శి హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ బ్రాంచ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రఘునాథ్, ఖుర్షీద్ అలీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఉత్త పుణ్యానికి పనులవుతాయా..!
ఏసీబీకి పట్టుబడ్డ ధర్పల్లి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు ఎవరైనా పనుల కోసం వెళ్తే ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవారని, పైగా ‘ఉత్త పుణ్యానికే పనులవుతాయా..’ అంటూ దబాయించేవారని పలువురు పేర్కొన్నారు. సంధ్యారాణి ఈవోపీఆర్‌డీగా అదనపు బాధ్యతలతో పాటు సీతాయిపేట్‌కు ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మండలంలో ఏసీబీ దాడులు అధికారుల్లో చర్చనీయాంశగా మారింది.
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
Published Thu, Nov 20 2014 3:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement