ఆయనో పంచాయతీ కార్యదర్శి. ఉద్యోగంలో చేరి రెండేళ్లే అయ్యింది. అయితేనేమి అవినీతిలో అందవేసిన చేయిగా ఎదిగాడు. పుడితే...లంచం...చస్తే...లంచం. చివరకు నిరుపేదలను సైతం విడిచిపెట్టలేదు. ప్రతీ పనికి లంచం రుచిమరిగాడు. ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం కార్యదర్శి చుట్టూ నాలుగు నెలలుగా తిరిగి తిరిగి వేసారిపోయి...చివరకు ఆ పత్రం కోసం రూ.2వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో అవినీతి చేపను వలపట్టి పటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...
* పట్టుబడిన మోదుగులపేట కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శి
* మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.2 వేల డిమాండ్
* ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
* పక్కా ప్రణాళికతో పట్టుకున్న వైనం
సంతకవిటి: మండలంలోని మోదుగుల పేట పంచాయతీ కార్యదర్శి గోపి రెండేళ్ళ క్రితమే విధుల్లో చేరాడు. ప్రతీ పనికి లంచం రుచిమరిగాడు. మోదుగులపేట గ్రామానికి చెందిన మజ్జి రాము తన తండ్రి మజ్జి అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.2 వేలు డిమాండ్ చేశాడు. మజ్జి రాము ఈ విషయంపై గ్రామ పెద్ద లు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా గ్రామ పెద్దలు కార్యదర్శిని మంది లించినప్పట్టకీ ఫలితం కనిపించలేదు. ఇలా నాలుగు నెలలు గడవడంతో విసుగు చెందిన రాము చివరకు శ్రీకాకు ళం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పథకం ప్రకారం...
రాము నుంచి వివరాలు సేకరించిన జిల్లా ఏసీబీ అధికారులు మోదుగులపేట పం చాయతీ కారదర్శిపై నెల రోజులుగా దృష్టి సారించినట్లు తెలిసింది. చివరకు పథకం రచించిన డీఎస్పీ రంగరాజు, సీఐ పి.శ్రీనివాసరావు సోమవారం బాధితుడైన రాముతో కలసి సంతకవిటి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా రూ.2వేలతో పంచాయతీ కార్యదర్శి వద్దకు రామును పంపించారు. ఆ వెంట వారు కూడా అనుసరించారు. రాము నుంచి రూ.2 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి గోపి ఏసీబీ అధికారులకు పక్కాగా పట్టుబడ్డాడు. గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడి పంచాయతీ కార్యదర్శుల సమావేశ కార్యాలయంలో మరిన్ని వివరాలు సేకరించారు. విచారణ అనంతరం శ్రీకాకుళం తరలించారు.
డబ్బులు ఇచ్చుకోలేకే...
నా తండ్రి అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం నిమిత్తం నాలుగు నెలలుగా పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుని తిరుగుతున్నాను. ప్రతీసారి ఏదో ఒక సాకుచెప్పి తప్పించుకునేవాడు. చివరకు తనకు రూ. 2 వేలు కావాలని పట్టుబట్టాడు. ఈ విషయం గ్రామపెద్దలకు చెప్పగా వారు మందలించడంతో నాకు హెచ్చరికలు జారీ చేసి మరింత ఎక్కువ డబ్బులు అవుతాయని అన్నాడు. ఈ డబ్బులు ఇచ్చుకోలేకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఇలాంటి లంచగొండి అధికారులను విడిచిపెట్టరాదు.
- మజ్జి రాము, బాధితుడు, మోదుగులపేట
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
Published Tue, May 31 2016 10:26 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement