అలా.. ఇరుక్కుపోయి..
తప్పటడుగులేయిస్తున్న ఒత్తిళ్లు
కీలక ప్రజాప్రతినిధి నిర్వాకంతో అధికారుల బలి
వరుస సంఘటనలతో ఉద్యోగుల బెంబేలు
అక్కడ పనిచేసేందుకు భయపెడుతున్న పరిస్థితులు
ఇదేం విచిత్రమోగానీ... గత కొంతకాలంగా ఎస్.కోట నియోజకవర్గంలో పలువురు అధికారులు అనవసరంగా బలైపోతున్నారు. అక్కడి కీలక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో తప్పటడుగులు వేసి ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్నారు. కొందరు తెలివిగా తప్పించుకుంటున్నా... ఇంకా కొందరు ఇరుక్కుపోతున్నారు. వరుస సంఘటనలతో అక్కడ పనిచేస్తే ఏదైనా ముప్పువస్తుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికారులు ఒకరివెనుక ఒకరు లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుపోతున్నారు. అక్కడి కీలక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లకు తలొగ్గి పీకమీదకు తెచ్చుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఎస్‌కోట రైతు బజారు స్థలం కేటాయింపు తీర్మానం విషయంలో సర్పంచ్ చెక్‌పవర్ కోల్పోవడంతో పాటు పంచాయతీ కార్యదర్శి చార్జిమెమోను ఎదుర్కొన్నారు. సమగ్ర విచారణ తర్వాత వీరి ఉద్యోగానికి ఎసరొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్‌కోట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రైతుబజారుకు గతంలో కేటాయించిన స్థలంలో ఐనాక్స్ థియేటర్‌కు మేలు చేకూర్చేలా పంచాయతీలో రోడ్డు నిర్మాణంకోసం తీర్మానం చేయడం వెనక నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉంది.
తెరవెనుక చోటుచేసుకున్న ముడుపుల వ్యవహారం నేపథ్యంలో హుటాహుటిన పంచాయతీ కార్యవర్గ సమావేశంలో రోడ్డు కోసం తీర్మానం చేయించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడా ప్రజాప్రతినిధి బాగానే ఉన్నారు. ఆ తీర్మానం చేసినందుకు సర్పంచ్ చెక్‌పవర్ కోల్పోయారు. పంచాయతీ కార్యదర్శి చార్జిమెమో అందుకున్నారు. భవిష్యత్‌లో ఇంకేం జరుగుతుందో తెలియడంలేదు. ఇటీవల వేపాడ మండలం వెల్దాంకు అంగన్‌వాడీ ఆయా పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టు కోసం తొండవరపు పుష్ప దరఖాస్తు చేశారు. వాస్తవంగా ఆమె అదే మండలంలోని వీలుపర్తి గ్రామంలో అప్పటికే రేషన్‌కార్డు ఆధారంగా నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందారు.
ఈ పోస్టుకోసం వెల్దాంలో ఉంటున్నట్టు ఆమె మరో నివాస ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారు. ఒకసారి రేషన్ కార్డు ఆధారంగా, మరోసారి ఆధార్ కార్డు ఆధారంగా రెవెన్యూ అధికారులు ఆ పత్రాలు జారీ చేశారు. దీని వెనుక నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందని తెలిసింది. ఆ పోస్టుకు ప్రయత్నించి విఫలమైన ఒబ్బిన సత్యవతి అనే మహిళ దీనిపై ఫిర్యాదు చేశారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించగా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు అరెస్టు వారెంట్ జారీ అవుతుందన్న అనుమానంతో ముం దస్తు బెయిల్ తెచ్చుకున్నట్టు సమాచారం. దీనిపై వారు ఆ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తే ‘మేమోదో చెబుతాం...మీరు చూసుకుని చేసుకోవాలి’అని తప్పించుకుంటున్నట్టు తెలిసింది.
కొద్ది రోజుల క్రితం కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో ప్రతీదానికి చేయి చాపుతున్నారని జిల్లా పరిషత్ సీఈఓకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విచారణ కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్, టైపిస్టులను యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు. అయితే, చేయి చాపడానికి అసలు కారణం కీలక ప్రజాప్రతినిధి సోదరుడ్ని సంతృప్తి పరచడానికేనన్న వాస్తవం బయటపడింది. మొత్తానికి రాజకీయ జోక్యం నేపథ్యంలో ఇద్దరు అకస్మికంగా బదిలీపై వెళ్లిపోగా, మిగతా అధికారులపై విచారణ నడుస్తోంది. ఆ మధ్య కొత్తవలస మార్కెట్ కోసం రూ. 30లక్షలు మంజూరయ్యాయి. ఐదేసి లక్షలకొక పని చొప్పున చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఏదో ఒక సంఘానికి ఆ పనుల్ని అప్పగించాలి. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు అక్కడ పనిచేసిన పంచాయతీరాజ్ జేఈ బాపినాయుడుపై ఒత్తిడిచేసి మొత్తం రూ. 30లక్షల పనులు తాను సూచించిన సంఘానికే ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకే సంఘానికి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని జేఈ అభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు. అలాగే, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెట్ పనులు క్వాలిటీ విషయంలో చూసీ చూడనట్టు వదిలేయాలని ఒత్తిడికి దిగారు. దీంతో అసలుకు ఎసరొచ్చేలా ఉందని ఆ జే ఈ యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.