పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు 73.50 శాతం హాజరు
Published Mon, Feb 24 2014 2:49 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష జిల్లాలో ప్రశాంతం జరిగింది. సుమారు 73.50 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 209 పోస్టులకు మొత్తం 34,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఏడు పట్టణ ప్రాంతాల్లోని 102 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 25,459 మంది హాజరు కాగా 9,023 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపరు-2 పరీక్షకు 25,353 హాజరు కాగా 9,129 మంది గైర్హాజరయ్యారు. ఈ పోస్టులకు 34,477 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు ఇంతకుముందు పలు సందర్భాల్లో ప్రకటించినా.. తీరా పరీక్ష సమయానికి మరో ఐదుగురు పెరిగారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, ఏపీపీఎస్‌సీ పరిశీలకురాలు(ఏసీ) పి.సుశీల తదితరులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్షలు జరిగిన తీరును పరిశీలించారు.
పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక అభ్యర్థి స్క్రైబ్ సహయంతో పరీక్ష రాశారు.
పాలకొండ నవోద య కేంద్రంలో ఒక అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోగా అక్కడే ప్రథమ చికిత్స చేశారు.
పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ, ఆమదాలవలస, రణస్టలం, పాతపట్నం పట్టణాలు రద్దీగా మారాయి. రెండు పూటలూ పరీక్ష ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ, హడావుడి కనిపించింది. మధ్యాహ్నం కూడా పరీక్ష ఉండటంతో అభ్యర్థులు, వారి తో వచ్చిన వారు ఆయా కేంద్రాల్లోనే భోజనాలు చేశా రు. దీంతో హోటళ్లు, మెస్‌లు, టిఫిన్ స్టాల్స్ కిటకిటలాడాయి. చాలామంది భోజనాలు, టిఫిన్లు దొరక్క ఇబ్బంది పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పరీక్ష ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు బస్సులు, ఆటోల కోసం ఎగబడటంతో ఆదివారమైనా అవి కిటకిటలాడాయి.
Advertisement
Advertisement