పంచాయతీ కార్యదర్శి నిర్బంధం
గుంకలాం (విజయనగరం రూరల్):అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగించారని గుంకలాం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. పింఛన్లు ఎందుకు తొలగించారని నిలదీస్తూ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రమణకుమార్‌ను కొది సేపు నిర్బంధించారు. గ్రామ కమిటీలో ఎంపిక చేసిన జాబితా ఏమైందని కార్యదర్శిని ప్రశ్నించారు. జాబితా ఎంపికపై తన ప్రమేయం లేదని నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని లబ్ధిదారులకు కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదు. అలాగే జన్మభూమి-మాఊరు ర్యాలీని కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నెల 19, 20 తేదీల్లో సర్పంచ్ కర్రోతు రమణమ్మ అధ్యక్షతన ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల కమిటీలకు, అక్కడ నుంచి జిల్లా కమిటీలకు పంపించారు.
జిల్లా కమిటీలకు పంపించిన జాబితాను సర్పంచ్ సంతకం కోసం అధికారులు పంచాయతీ కార్యదర్శి ద్వారా గురువారం పంపించారన్నారు. జాబితాను పరిశీలించిన సర్పంచ్ రమణమ్మ గ్రామ కమిటీలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు, అధికారుల పంపించిన జాబితాకు పొంతన కుదరలేదన్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రమణకుమార్‌ను ప్రశ్నించారు. గ్రామ కమిటీలో ఎంపిక చేసిన జాబితాపై జెడ్పీటీసీ అభ్యంతరం వ్యక్తం చేసి పేర్లు తొలగించారని తెలిపారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు.
అలాగే గ్రామంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛంధ్ర ప్రదేశ్ ర్యాలీని అడ్డుకున్నారు. జాబితాలో అర్హులైన 50 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించేశారని, వారంతా నిరుపేదలు, వితంతులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులేనని సర్పంచ్ రమణమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. టీడీపీకి చెందిన కొందరి పేర్లు జాబితాలో ఉండటంపై వారు ధ్వజమెత్తారు. అర్హుల పేర్లు తొలగిస్తే కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆందోళన జరుగుతున్న సమాచారాన్ని టీడీపీ ప్రజాప్రతినిధి రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆందోళన విరమించడంతో పోలీసులు వెనుదిరిగారు.