రూ.5లక్షల పెన్షన్లు స్వాహా!
చింతపల్లి : చివరికాలంలో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ను పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని బలపం పంచాయతీలో 355 మంది పింఛనుదారులకు సంబంధించి రూ.5లక్షలు కార్యదర్శి ఎస్‌వీజేఎస్ కుమార్ స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీవో సువర్ణరాజు ఆదేశాలమేరకు విచారణ చేపట్టారు. పంచాయితీలో మొత్తం 357 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 112 మంది వితంతువులు, 11 మంది వికలాంగులు, 234 మంది వృద్ధులు. వీరికి ప్రతి నెల రూ.7.2 లక్షల పింఛనుసొమ్ము మంజూరవుతోంది.
పంచాయితీ ఎన్నికల అనంతరం సర్పంచ్ సిందేరి కార్లను మావోయిస్టులు హత్య చేయడంతో కొంతకాలం పాటు ప్రత్యేక అధికారి పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. 30 నెలల క్రితం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కుమార్ ఏకంగా 501 రోజు సెలవులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.7,20,500 నిధులను డ్రా చేసి మేలో పంపిణీకి చర్యలు చేపట్టారు. మే14న ఎంపీడీఓ కార్యాలయానికి అక్విటెన్సులు సమర్పించి రూ.5,20,500 పంపిణీ చేసినట్లు రికార్డులో చూపించారు.
మిగిలిన రూ.2 లక్షలు అధికారులకు తిరిగి అప్పగించారు. దీనిపై పలువురు లబ్ధిదారులు తమకు పింఛను అందలేదంటూ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై కార్యదర్శిని నిలదీయడంతో సెలవు పెట్టారు. లబడంపల్లి కి చెందిన కోరాబు కృష్ణపడాల్, కోరాబు సన్యాసమ్మ, వంతల కాసులమ్మతోపాటు చాలా మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసినట్లు అక్విటెన్సుల్లో వేలిముద్రలు వేసి వున్నాయి. కానీ ఇక్కడ ఎవరికి పింఛన్లు అందలేదు. అదే గ్రామానికి చెందిన గబిలంగి గంగన్నదొర మృతి చెందినప్పటికీ అతడి పేరుమీద కూడా పింఛను పంపిణీ చేసినట్లు అక్విటెన్సుల్లో నమోదు చేసివుంది.
ఫిర్యాదుల మేరకు ఎంపీడీవో సువర్ణరాజు, లోతుగెడ్డ వీఆర్‌ఓ కృష్ణారావును పింఛన్లపంపిణీలో అవకతవకలపై వివరాలు సేకరణకు నియమించారు. ఈ విషయమై ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో చాలా మంది లబ్దిదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు అందనట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, గతంలో కూడా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేశారా? లేదా అన్నదానిపై కూడా పూర్తి విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.