ఫకీర్‌పేట గ్రామ పంచాయతీ కార్యాలయం
సాక్షి, కరీంనగర్: నిరుద్యోగ యువతకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి కొలువు దొరికిన సంబరం లేకుండా పోతోంది. బాధ్యతల బరువు, ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం గతంలో కార్యదర్శులకు ఉన్న చెక్‌పవర్ తొలగించడంతోపాటు అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు తమ పనుల కోసం ఒత్తిళ్లు తేవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల నుంచి ఒత్తిళ్లు భరించలేక కొందరు కార్యదర్శులు కొత్త ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గతనెల 23న కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మపై సర్పంచు భర్త బలుసుల శంకరయ్య దౌర్జన్యం చేయడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశం లేకుండా పోతుందంటూ పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12మంది రాజీనామా..
కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం ఏప్రిల్ 12న మొత్తం 205మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. వీరిలో 197మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరగా మిగతా 8మంది వివిధ కారణాలతో బాధ్యతలు చేపట్టలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం నియమించడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విధినిర్వహణపై అవగాహన లేకపోవడంతోపాటు కొత్తపంచాయతీరాజ్ చట్టంతో బాధ్యతలు పెరగడం, పనిభారంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో మంచి ఉద్యోగాలు రావడంతో కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు జీతాలు సైతం చెల్లించలేదు. ఇటీవల ప్రకటించిన ఎస్సై, ఫారెస్ట్‌బీట్ ఆఫీసరు ఉద్యోగాలకు పలువురు కార్యదర్శులు ఎంపికయ్యారు. దీంతో వెంటనే కార్యదర్శి పోస్టులకు రాజీనామా చేసి ఆయా ఉద్యోగాల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 12మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో ప్రకటించే గ్రూప్–2, కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు కార్యదర్శులు సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment