మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :పంచాయతీ కార్యదర్శి పరీక్ష ఆదివారం.. అయితే పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రం ఒక రోజు ముందే పరీక్ష రాసినట్లుగా తయారైంది. ఆర్టీసీ బస్సుల కోసం ముందుగానే బస్టాండ్‌కు చేరుకుని టికెట్లు బుకింగ్ చేసుకుని మరీ పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగున్నా అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆసరాను అదనుగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 50 శాతం అదనపు చార్జీలతో అభ్యర్థులపై ఆర్థిక భారం మోపింది. దీంతో రెగ్యులర్‌గా ఉండే చార్జీలు కాస్త ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో తడిసి మోపడవుతున్నాయి.
నిర్మల్, ఆదిలాబాద్‌కు వెళ్లే బస్సులకు వాస్తవానికి ఇతర రోజుల్లో చార్జీలు వేరేలా ఉంటాయి. కానీ పరీక్షలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుండటంతో ఈ చార్జీలు వారిపై మోపుతూ ఆర్టీసీ ఆదాయానికి మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే శనివారం నిర్మల్‌కు 7, ఆదిలాబాద్‌కు 9 బస్సులకు సంబంధించి ముందస్తు టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ బస్సులన్నీ కూడా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ మార్గాలకు బయలుదేరుతాయి. పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో ఆదివారం పరీక్షా కేంద్రాలకు గంట ముందు చేరుకోకుంటే నష్టపోవాల్సి వస్తుందని.. ఒక రోజు ముందుగానే అభ్యర్థులు వచ్చారు. దీంతో మంచిర్యాల బస్టాండ్ శనివారం ఇటు ప్రయాణికులతో పాటు అటు పరీక్షకు వచ్చిన అభ్యర్థులతో కిటకిటలాడింది.
తడిసిమోపెడు...
ఆర్టీసీ అధికారులు మూకుమ్మడి ప్రణాళికతో ప్రత్యేక బస్సుల చార్జీలు పెంచేశారు. ప్రస్తుతం నిర్మల్‌కు రూ.117 ఉన్న చార్జీ అభ్యర్థులకు మాత్రం రూ.176గా నిర్ణయించారు. అంటే రూ.59 పెంచారు. అలాగే ఆదిలాబాద్‌కు ప్రస్తుతం రూ.129 చార్జి కాగా అభ్యర్థులకు రూ.194 చార్జి చేశారు. అదనంగా రూ. 65 ఎక్కువ చేసి వసూలు చేస్తున్నారు.
16 బస్సులకు రిజ్వేషన్ ‘ఫుల్’...
మంచిర్యాల బస్టాండ్ నుంచి నిర్మల్‌కు 7, ఆదిలాబాద్ మార్గాల్లో 9 బస్సులను వేశారు. వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో ఆ బస్సుల్లో రిజర్వేషన్ కోసం గంటలోపు టిక్కెట్లను బుకింగ్ చేసేసుకున్నారు. రిజర్వేషన్లు ఫుల్ కావడంతో నిర్మల్‌కు 4, ఆదిలాబాద్‌కు 4 బస్సులను అదనంగా వేశారు. ఈ బస్సులు కూడా ఉదయం 4 గంటలకు బస్టాండ్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే.. సుదూర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది అభ్యర్థులు గ్రూపులుగా ఏర్పడి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.