రూ.లక్ష కొట్టు.. పోస్టు పట్టు.. | 1 lakh for Panchayat Secretary job | Sakshi
Sakshi News home page

రూ.లక్ష కొట్టు.. పోస్టు పట్టు..

Published Tue, Nov 19 2013 4:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

1 lakh for Panchayat Secretary job

 మీరు పంచాయతీ కార్యదర్శి కావాలనుకుంటున్నారా..  అయితే రూ.లక్ష  ఉంటేచాలు.. అసలే తక్కువ పోస్టులు... మంచి డిమాండ్.. ముందుగా డబ్బులు చెల్లించిన వారికే అవకాశం’ అంటూ దళారులు, కొందరు రాజకీయ  నాయకులు నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. కొందరు అధికారులు పంచాయతీ కార్యదర్శుల భ ర్తీ పేరిటచేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..
 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
 జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 161 పంచాయతీలకే కార్యదర్శులు ఉన్నారు. వీరికితోడు 28 మంది కాంట్రా క్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. మొత్తం 189 మంది ప్రస్తుతం విధు లు నిర్వహిస్తున్నారు. ఏడాదిగా జిల్లాలో 677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండగా ఎట్టకేలకు 30 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 30 పోస్టుల కోసం సుమారుగా తొమ్మిది రోజులపాటు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 3,542 వచ్చినట్లుగా ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శుల కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకోవడాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు, పైరవీకారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది.
 
  రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో భవిష్యత్‌పై ఆందోళనలో ఉన్న నిరుద్యోగులు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్న  వారి తపనను దళారులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజినీరింగ్, పీజీ తదితర అర్హతలున్న యువకులు కార్యదర్శుల పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో రూ.లక్షతో రావాలని దళారులు నేరుగా రంగంలోకి దిగడం ఆందోళన కల్గిస్తుంది.
 
 రాజకీయ నేతల చుట్టూ నిరుద్యోగుల ప్రదక్షిణలు
 ఓ వైపు దళారులు నిరుద్యోగులకు ఎరవేసే చర్యలు ముమ్మరం చేయగా, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీలకు రంగంలోకి దిగినట్లు సమాచారం. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో పైరవీలు, దళారుల పాత్రకు అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నా, దళారులు మాత్రం ఉద్యోగం వచ్చే వరకు తమ పేర్లు రహస్యంగా ఉంచాలని జాగ్రత్త పడుతున్నట్లు నిరుద్యోగులు వాపోతున్నారు. ఓ వైపు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పేరిట దళారులు వసూళ్లకు పాల్పడుతుంటే.. మరోవైపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు కొందరు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. కార్యదర్శులు గ్రామ వ్యవహారాల్లో కీలకమైన వ్యక్తులు కావడం వల్ల అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌లకు చెందిన కీలక నేతల చుట్టూ తిరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుండగా కార్యదర్శులకు నియామకానికి   కలెక్టర్ చైర్మన్, జిల్లా పంచాయతీ అధికారి కన్వీనర్, జెడ్పీ సీఈవో సభ్యులుగా కమిటీ ఉండగా, పాదర్శకంగా మెరిట్ జాబితా ఆధారంగా భర్తీ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయినప్పటికీ దళారులు నిరుద్యోగులను ఆశపెట్టి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తుండగా.... ఇంకొందరు నిరుద్యోగులే దళారులు, రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు.
 దళారులుగా వ్యవహరిస్తే కేసులు..
 - కె.పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి
 
 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పూర్తిగా పారదర్శకంగా సాగుతుంది. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా నియామకాలు ఉంటాయి. అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించిన తర్వాత మెరిట్ జాబితాను వెల్లడించడం జరుగుతుంది. అభ్యర్థులు అపోహలకు లోనుకావద్దు. నిరుద్యోగ యువకులు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరైనా వసూళ్లకు పాల్పడినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement