భలే గిరాకీ | More demand to panchayat secretary | Sakshi
Sakshi News home page

భలే గిరాకీ

Published Wed, Nov 20 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

More demand to panchayat secretary

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:   పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై దళారులు కన్నేశారు. రెండు వందల పైచిలుకు ఉన్న ఉద్యోగాలకు  ఏకంగా 15 వేలకు పైగా మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో దందాకు దిగారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే అభ్యర్థుల ఆరాటాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు మొదలుకుని బేరసారాలు సాగిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు పోస్టు తమకే దక్కేలా చూడాలంటూ అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు చెప్తున్నా, నిరుద్యోగుల మాత్రం ‘మార్గం’ వెతికే పనిలో ఉన్నారు.
 జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-4 పోస్టుల భర్తీకి కలెక్టర్ (పంచాయతీ వింగ్) కార్యాలయం అక్టోబర్ 31న నోటి ఫికేషన్ జారీ చేసింది. నవంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 210 పోస్టులకు గాను 15,434 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత జిల్లా ఎంపిక కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఈ నెల 29 లోగా నియామకపు ఉత్తర్వులు ఇస్తామంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేశారు. అంచనాలకు మించి దరఖాస్తులు అందడంతో అభ్యర్థుల వివరాలను కంప్యూటర్‌లో
 
 నిక్షిప్తం చేసేందుకు  జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది నిమగ్నమయ్యా రు. మరో వారం పది రోజుల పాటు వివరాల నమోదు ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు అర్హుల వడపోతపై అధికార యంత్రాం గం దృష్టి సారించగా, మరోవైపు దళారీలు రంగ ప్రవేశం చేసి కాసుల వేటలో పడ్డారు. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని బేర సారాలకు దిగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.4 లక్షల వరకు బేరసారాలు సాగుతున్నాయి. అడ్వాన్సుగా లక్ష రూపాయలు చెల్లించి, పని పూర్తయిన తర్వాత మిగతా మొత్తం ఇవ్వాలంటూ ఆశల వల విసురుతున్నారు. సిద్దిపేట, మెదక్ డివిజన్ల పరిధిలో కొందరు చోటా మోటా నేతలు ‘ఔత్సాహికుల వేట’లో ఉన్నారు. అధికార పార్టీ నేతల చుట్టూ కొందరు అభ్యర్థులు చక్కర్లు కొడుతూ సిఫారసుల కోసం ఒత్తిడి చేస్తున్నారు.
 కాంట్రాక్టు కార్యదర్శుల్లో ఆందోళన
 జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలను 515 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్టస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శిని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం 320 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండగా, వీరిలో 205 మంద కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా రు. వీరిలో కొందరు 2003లో, మరికొం దరు 2006లో కా్రంటాక్టు కార్యదర్శులుగా విధుల్లో చేరారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో వీరికి 25 మార్కులు వె యిటేజీగా ప్రకటించినప్పటికీ, డిగ్రీ మార్కు ల ప్రాతిపదికన చాలా మంది ఎంపికయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
 పారదర్శకత పాటిస్తాం: డీపీఓ
 దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 4,5 రోజుల్లో వివరాల కంప్యూటరీకరణ పూ ర్తవుతుంది. డిగ్రీ మార్కుల ప్రాతిపదిక న అర్హులను ఎంపిక చేస్తాం.  నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేస్తాం.
 - ప్రభాకర్‌రెడ్డి, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement