
గుజరాత్ నుంచి కార్యదర్శికి ఆహ్వానం
వీరపునాయునిపల్లె: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న గుజరాత్‌లో జరిగే సదస్సులో పాల్గొనాలని తంగేడుపల్లె పంచాయతీ కార్యదర్శి సుజితకు ఆహ్వానం అందింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ఈ సదస్సుకు మన జిల్లా నుంచి పంచాయతీ కార్యదర్శుల్లో ఆమెను ఎంపిక చేశారు. స్వచ్చభారత్ అమలులో మంచి సేవలు అందించినందుకు గాను ఈ అవకాశం దక్కింది. తంగేడుపల్లెలో ఓడీఎఫ్ కింద 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించడంతోపాటు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు గాను గత జన్మభూమి గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. గణతంత్ర వేడుకలలో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆమె గుజరాత్‌కు వెళ్లడానికి ఆదివారం బయలుదేరారు.
గర్వకారణం: ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి సుజిత ఎంపిక కావడంపై ఎంపీపీ ప్రసాదరెడ్డి, ఎంపీడీవో మల్లికార్జునరెడ్డి, పంచాయతీ అధికారి శ్రీనివాసులరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మండలానికే గర్వ కారణంగా నిలిచిందని వారు కొనియాడారు.