ప్రధాని సోషల్‌ ఖాతాలు ఆ ఏడుగురికి | Narendra Modi hands over social media accounts to seven women achievers | Sakshi
Sakshi News home page

ప్రధాని సోషల్‌ ఖాతాలు ఆ ఏడుగురికి

Published Mon, Mar 9 2020 4:19 AM | Last Updated on Mon, Mar 9 2020 5:10 AM

Narendra Modi hands over social media accounts to seven women achievers - Sakshi

స్నేహ మోహన్‌ దాస్‌, డాక్టర్‌ మాళవిక, ఆరిఫా జాన్‌, కల్పన రమేష్‌, విజయ పవార్‌, కళావతి దేవి, వీణా దేవి

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందే చెప్పినట్టుగా ఆదివారం తన సోషల్‌ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ‘‘ఈ మహిళా దినోత్సవం నాడు నా సామాజిక మాధ్యమాల ఖాతాలను ఎవరి జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయో ఆ శక్తిమంతమైన ఏడుగురు మహిళలకి అప్పగిస్తున్నాను. ఇలా చేయడం వల్ల వారు చేస్తున్న సామాజిక సేవ లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ రోజంతా నేను నా అకౌంట్ల నుంచి తప్పుకుంటాను. ఆ ఏడుగురు మహిళలు వారి జీవిత ప్రయాణాన్ని నా అకౌంట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు. మీతో చర్చలు జరుపుతారు’’అని ట్వీట్‌ చేసిన ప్రధాని తన ఖాతాలను వారికి అప్పగించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన కల్పన రమేష్‌ అనే మహిళ కూడా ఉండటం విశేషం. ఆ ఏడుగురు మహిళలెవరో వారు సమాజానికి చేస్తున్నదేంటో చూద్దాం..    

స్నేహ మోహన్‌ దాస్, చెన్నై
ఆమె అందరికీ అమ్మయింది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే అమ్మనే అంటాం కదా. ఆకలి కేకలు ఎంతటి దుర్భరమైనవో గ్రహించి ఫుడ్‌బ్యాంక్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్నారు. ప్రతీరోజూ ఒకరి ఆకలి తీర్చి, ఆహార వృథాను అరికట్టగలిగితే ఈ దేశంలో ఆకలికేకలు వినిపించవని స్నేహ మోహన్‌దాస్‌ చెబుతున్నారు. ఈ విషయంలో అందరూ చేతులు కలపాలంటూ ప్రధాని అకౌంట్‌ ద్వారా ఆమె పిలుపునిచ్చారు. ఈ సంస్థను స్థాపించాలని స్నేహలో స్ఫూర్తిని నింపింది ఎవరో తెలుసా? స్నేహను కన్న అమ్మే. అమ్మలకే కదా బిడ్డల ఆకలి తెలిసేది.

డాక్టర్‌ మాళవిక అయ్యర్‌
తమిళనాడుకి చెందిన మాళవిక ఒక దివ్యాంగురాలు. 13 ఏళ్ల వయసులో రాజస్తాన్‌లో బికనీర్‌లో ఉన్నప్పుడు బాంబు పేలుళ్లలో ఆమె చేతులు కోల్పోయారు. కాళ్లు విరిగిపోయాయి. వంటినిండా ఫ్రాక్చర్లే. అయినా ఆమె ఏనాడూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కృత్రిమ చేతులతో అన్ని అడ్డంకుల్ని అధిగమించారు. ఆ చేతులతోనే పీహెచ్‌డీ రాశారు. డాక్టరయ్యారు. ఇప్పుడు సామాజిక కార్యకర్తగా పలువురిలో స్ఫూర్తిని నింపుతున్నారు. జీవితం మనకేమిస్తుందో మన చేతుల్లో లేదు. కానీ అది ఏమిచ్చినా దానిని అంగీకరించి ముందుకు అడుగు వెయ్యడమే మనం చెయ్యాల్సిన పని. జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చుకుంటే, జీవితం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలం అంటూ మాళవిక తనని తాను  పరిచయం చేసుకున్నారు. ఈ పురస్కారం ఆమెను కూడా వరించింది.

ఆరిఫా జాన్, కశ్మీర్‌
కశ్మీర్‌లో సంప్రదాయమైన చేతివృత్తుల్ని పునరుద్ధరించి, వాటికో బ్రాండ్‌ కల్పించడానికి కృషి చేస్తున్నారు ఆరిఫా. శ్రీనగర్‌కు చెందిన ఈ మహిళ నంధా అని పిలిచే చేతివృత్తుల కళను పునరుద్ధరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఉండే మహిళా కళాకారులకు సాధికారత వస్తుందని ఆమె అంటున్నారు. సంప్రదాయానికి ఆధునికత జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని ఆరిఫా ధీమాగా చెబుతున్నారు. కశ్మీర్‌ చేతివృత్తులపై మహిళలకు శిక్షణనివ్వడమే కాకుండా వారి వేతనాలను రోజుకి రూ.175 నుంచి రూ. 450కి పెంచారు.

కల్పన రమేష్, హైదరాబాద్‌
వృత్తిపరంగా ఆమె ఒక ఆర్కిటెక్ట్‌. కానీ ఆమె తన జీవితాన్ని నీటి సంరక్షణకే అంకితం చేశారు. టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌... తాను డిజైన్‌ చేసిన నీటి సంరక్షణని ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే తరాలకు నీటి సమస్య రాకుండా ఉండడానికే తాను ఈ అంశంపై దృష్టి సారించినట్టు కల్పన చెప్పారు. ఒక్కోసారి చిన్ని చిన్ని పనులే అతి పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. సహజసిద్ధంగా మనకు లభించిన అత్యంత విలువైనవి నీళ్లే. వాటిని ఇష్టారాజ్యంగా వృథా చేయకుండా బొట్టు బొట్టు ఒడిసిపట్టుకోవాలి. చెరువుల్ని కాపాడుకోవాలి. వినియోగించిన నీటిని రీ సైకిల్‌ చేసి మళ్లీ వాడుకోవాలన్న అవగాహన పెంచాలని ఆమె ట్వీట్‌ చేశారు. సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎండీవర్‌ (సాహె) సంస్థను స్థాపించి వాననీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు.

కళావతి దేవి, కాన్పూర్‌
మోదీ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కి చెందిన కళావతి దేవి ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ఆమె విస్తృతంగా పోరాడుతున్నారు. కాన్పూర్‌ చుట్టుపక్కల 4 వేలకుపైగా టాయిలెట్లు నిర్మించి పరిసరాల పరిశుభ్రతపై మహిళల్లో అవగాహన పెంచుతున్నారు. ఆమెకి భర్తలేడు. తన కూతురు, వారిద్దరి పిల్లల పోషణ బాధ్యత ఆమె మీదే ఉంది. అల్లుడు కూడా మరణించడంతో కూతురి కుటుంబం బాధ్యతలు కూడా ఆమే తీసుకున్నారు. అయినా ఏనాడూ ఆమె బహిరంగ మల విసర్జనను మాన్పించాలన్న తన లక్ష్యంపై వెనకడుగు వెయ్యలేదు.

వీణా దేవి, బిహార్‌
ఆమె పేరు చెబితే ఎవరని అడుగుతారేమో కానీ మష్రూమ్‌ మహిళ అంటే రాష్ట్రంలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. బిహార్‌లో ముంగూర్‌ జిల్లాకు చెందిన వీణా దేవి పుట్టగొడుగుల సాగుతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలైన బెల్హార్‌లో మహిళా రైతులకు పుట్టగొడుగుల్ని సాగు చేయడంలో మెళకువలు నేర్పించి వారి ఆర్థిక స్థితిగతుల్ని పెంచారు. ఆమె ప్రభావంతో ముంగూర్‌ జిల్లాలోని 105 గ్రామాల్లో ఎందరో మహిళలు పుట్టగొడుగులను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంపైనా రైతులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

విజయ పవార్, మహారాష్ట్ర
మహారాష్ట్రకు చెందిన విజయ పవార్‌ బంజారా చేతివృత్తుల మహిళలతో కలిసి రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలోని గ్రామీణ గోర్మతి కళలో నిపుణులైన మహిళల్ని ప్రోత్సహిస్తూ వారి తయారు చేసిన ఉత్పత్తుల్ని విక్రయించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. 90 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి విజయ పవార్‌ ఈ కళని ప్రోత్సహిస్తున్నారు. బంజారా హ్యాండీక్రాఫ్ట్స్‌ అంతగా విజయవంతం కాని కళారూపంగా ఉందని, దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తన ట్వీట్‌లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement