ఆ రోజు మహిళలకే అంకితం | Narendra Modi Tweet About International Womens Day | Sakshi
Sakshi News home page

ఆ రోజు మహిళలకే అంకితం

Published Wed, Mar 4 2020 1:53 AM | Last Updated on Wed, Mar 4 2020 1:53 AM

Narendra Modi Tweet About International Womens Day - Sakshi

ఒక్క చాన్స్, ఒకే ఒక్క చాన్స్‌. మహిళలకు ఒక సూపర్‌ ఛాన్స్‌ వచ్చింది. వారి ఆలోచనల్ని ప్రపంచానికి పంచుకునే అరుదైన అవకాశం ఇది. స్ఫూర్తినిచ్చే మహిళల జీవితాలైనా, అలాంటి మహిళల గురించి తెలిసినవారైనా ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వారి జీవిత కథల్ని షేర్‌ చేసే అవకాశం ఇది. దీంతో వారి పోస్టులు క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ఫాలోవర్లకు చేరిపోతాయ్‌.

సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు ట్వీట్‌ చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపిన ప్రధాని మోదీ అన్ని రకాల ఊహాగానాలకు తెరదించారు. తన సోషల్‌ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను అందరిలోనూ స్ఫూర్తిని నింపే మహిళలకి ఆదివారం అంకితం ఇస్తున్నట్టుగా మంగళవారం మరో ట్వీట్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘ఈ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని నా సోషల్‌ మీడియా ఖాతాలను ఏ మహిళల జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాయో, వారు చేసే పనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయో వారికి అంకితం ఇస్తున్నాను. అలాంటి మహిళల నిజ జీవిత గాథలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి’ అని ట్వీట్‌ చేశారు.

‘మీరు అలాంటి మహిళ అయినా, లేదంటే అలాంటి స్ఫూర్తిని రగిల్చే మహిళల గురించి మీకు తెలిసినా వారి జీవిత గాథల్ని # SheInspiresUs అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన కొన్నింటికి ప్రధాని అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఇక యూట్యూబ్‌లో మోదీ అకౌంట్‌ ద్వారా వీడియోలు పోస్టు చేసే అవకాశం వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లు ఉన్న రాజకీయనాయకుడు మోదీయే. ఆయనకి ట్విట్టర్‌లో 5.33 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌ ఖాతాను 3.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

విదేశీ మాధ్యమాలను నిషేధించడానికేనా?
వచ్చే ఆదివారం సోషల్‌ మీడియా నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టుగా ప్రధాని ట్వీట్‌ వెలువడగానే రకరకాల వదంతులు చెలరేగాయి. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడానికి మోదీ ట్వీట్‌ సంకేతమా అని సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడానికే మోదీ ఈ ట్వీట్‌ చేసి ఉంటారని ఆరెస్సెస్‌ నేతలు ఆశగా ఎదురు చూశారు. చాలా కాలంగా మన దేశంలో తయారైన యాప్‌లే వాడాలని డిమాండ్‌ చేస్తున్నట్టు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కో కన్వీనర్‌ అశ్వని మహాజన్‌ తెలిపారు. అయితే మోదీ అభిమానులు ఆయన సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోతే తామూ బయటకు వచ్చేస్తామంటూ లక్షలాది మంది ట్వీట్‌ చేశారు. ఐ విల్‌ ఆల్సో లీవ్‌ హ్యాష్‌ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అయింది. – న్యూఢిల్లీ

సోషల్‌ మీడియా హాస్యాలతో సమయం వృథా: రాహుల్‌ 
మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా విదూషకుడి పాత్ర పోషిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘ప్రియమైన ప్రధాని గారూ, మీ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఒక జోకర్‌లా హాస్యాన్ని పండిస్తూ సమయాన్ని వృథా చేసే బదులు కరోనా సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టండి’ అని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో సింగపూర్‌ ప్రధాని తమæ పౌరులను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని రాహుల్‌ పోస్టు చేస్తూ, ఏదైనా ఇలా చేయాలంటూ ప్రధానికి హితవు పలికారు. నిజమైన నాయకుడంటే సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావాలని అన్నారు.‘ప్రతీ దేశానికి ఆ నాయకుల శక్తి సామర్థ్యాలను పరీక్షించే సమయం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలోనే నాయకుల సమర్థత బయటకి వస్తుంది’ అని రాహుల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement