ఒంగోలు, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 83 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ సీఈవో ఎ.ప్రసాద్ తెలిపారు. స్థానిక సీఎస్‌ఆర్ శర్మకాలేజీతో పాటు పలు సెంటర్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చీఫ్ సూపరింటెండెంట్లతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతిసెంటర్‌లో ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శర్మ కాలేజీ సెంటర్‌లోని ఇన్విజిలేటర్ల శిక్షణకు హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, ఇన్విజిలేటర్లు కూడా తమ వద్ద ఉంచుకోరాదన్నారు. ఓఎంఆర్ షీట్లను పూర్తిచేసే విషయమై అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకే అభ్యర్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. తాగునీటి సౌకర్యం, లైటింగ్ వసతులు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
93 పోస్టులకు 33,466 మంది...
జిల్లాలో 93 పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం 33,466 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 10 నుంచి గం.12.30 వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో పేపరు ఉంటాయి.