సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా వాదించింది. బెయిల్ మంజూరు చేస్తే రవిప్రకాశ్ సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని, పైగా మరో నిందితుడు నటుడు శివాజీ పరారీలో ఉన్నారని, దీంతో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు బాగా ఉన్నాయంది. కింది కోర్టే కాకుండా సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వలేదని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. ఇప్పటికే కింది కోర్టు రవిప్రకాశ్ బెయిల్ దరఖాస్తును కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళితే అరెస్ట్ నోటీసుకు 48 గంటల గడువు ఇవ్వాలని పేర్కొందని హరేన్ రావల్ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కింది కోర్టు ఉత్తర్వులకు ఇక్కడ సంబంధం లేదు. సుప్రీంకోర్టు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు’అని వ్యాఖ్యానించారు.
రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొనలేదని, 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని మాత్రమే చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. ఏబీసీఎల్‌లో రవిప్రకాశ్‌కు పది శాతమే వాటా ఉందని, 40 వేల షేర్లను రూ.20 లక్షలకు నటుడు శివాజీకి అమ్మినట్లుగా గత ఏడాది తప్పుడు పత్రాలు సృష్టించారని హరేన్ రావల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే వాటాల్ని విక్రయించడం నిజమైతే ఆ విషయాల్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేసిన రిటర్న్‌లో ఎందుకు పేర్కొనలేదన్నారు. షేర్ల అమ్మకాల గురించిగానీ, తద్వారా వచ్చిన రూ.20 లక్షల సొమ్ము గురించిగానీ రవిప్రకాశ్ లేదా శివాజీ ఆదాయపు పన్ను పత్రాల్లోనే కాకుండా రికార్డుల్లో కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. రూ.140 కోట్లతో 90 శాతం టీవీ9 వాటాల కొనుగోలుకు ఏబీసీఎల్, అలందాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాల్ని సృష్టించి అమ్మకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ కుట్ర పన్నారని ఆరోపించారు.
టీవీ9, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ రూ.99 వేలకు చట్ట వ్యతిరేకంగా అమ్మేయడమే కాకుండా మరో మీడియా సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే రవిప్రకాశ్ తప్పించుకు తిరిగారని, ఇప్పటికీ శివాజీ పరారీలో ఉన్నారని హరేన్ రావల్ వాదించారు. కేసు విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ మంజూరు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాక పోలీసుల దర్యాప్తునకు రావ డం ప్రారంభించారని పేర్కొన్నారు. దర్యాప్తులో కూడా పొంతనలేని జవాబులు చెబుతున్నారని, మీడియా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని, ఈ దశలో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని రావల్ వాదించారు.
మౌనంగా ఉండటమూ హక్కే..
తొలుత రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లూవాలియా వాదిస్తూ.. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. పోలీసులు 40 గంటలపాటు విచారించారని, పోలీసులు తాము కోరుకున్న జవాబులు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా హక్కేనని చెప్పారు. టీవీ9లో శ్రీనిరాజుకు ఉన్న 90 శాతం వాటాను కొనుగోలుకు సైఫ్ మారిషస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి సైఫ్ మారిషస్ స్టే ఉత్తర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్లకు విక్రయించారని తెలిపారు.
ఒక్కసారిగా సైఫ్ మారిషస్ ఆ కేసును వెనక్కి తీసుకుందని, దీని వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని, రూ.294 కోట్లు టెర్రరిస్టుల్లాంటి వారికి అందే హవాలా తరహాలో బదిలీలు జరిగాయని, దీనిపై రవిప్రకాశ్ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెంటపడిందని చెప్పారు. ఈ కేసుల వెనుక కుట్ర ఉందని, ఒక కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని చెప్పగా, హరేన్ రావల్ కల్పించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈ విధంగా విచారించే వీలుందన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
బెయిలిస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు..
Published Tue, Jun 11 2019 2:51 AM | Last Updated on Tue, Jun 11 2019 10:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment