
సాక్షి, హైదరాబాద్: పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం (22న) హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్య మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్‌సీఎల్‌టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారన్నారు.
తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ఎన్‌సీఎల్‌టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల వెనకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదని ఆయన అన్నారు. ఎన్‌సీఎల్‌టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు.
పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్‌సీఎల్‌టీ తేల్చాల్సి ఉందన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రవిప్రకాశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment