సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బంజారాహిల్స్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గోడ దూకి పారిపోయానని, పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రవిప్రకాశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టేసింది. రవిప్రకాశ్ విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇప్పటికే పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41–ఏ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని, ఈ కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు.
కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయి...
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. అందుకే ఒకే అంశానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. పిటిషనర్ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారని, వాస్తవానికి ఆ డాక్యుమెంట్లు గతేడాది ఏప్రిల్ 18న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు సమర్పించారని తెలిపారు. దాదాపు ఏడాది తరువాత పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
ఎన్‌సీఎల్‌టీ ముందు విచారణలో ఉన్న వ్యవహారంలో కేసు నమోదు చేయడం దురుద్దేశాలతో కూడుకున్నదని వివరించారు. దురు ద్దేశాలతో కేసు నమోదు చేసినప్పుడు, ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు ఇప్పటికే సీఆర్‌సీపీ సెక్షన్ 41–ఏ, సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ స్పందించలేదన్నారు. ముందు ఆయనను పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
అందుకే అప్పుడు గోడ దూకి పారిపోయారు...
ఈ సమయంలో అహ్లువాలియా స్పందిస్తూ ఇటీవల టీవీ9 స్టూడియాలోకి వచ్చిన పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్‌కు ప్రయత్నించడంతో ఆయన గోడ దూకి పారిపోయారని తెలిపారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు కేసు పెట్టారని, అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్‌సీఎల్‌టీ తప్ప పోలీసులు కాదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు.
బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు...
అయితే ఈ వాదనను ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే కేసును 15 రోజులకు వాయిదా వేయవచ్చునని, ఈలోగా పిటిషనర్‌ను పోలీసులు ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. రవిప్రకాశ్ బయట ఉండి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఎటువంటి వాంగ్మూలాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. తామేమీ రవిప్రకాశ్ విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోబోమన్నారు. దీనికి అహ్లువాలియా స్పందిస్తూ, ఆ 15 రోజుల వరకైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందు విచారణకు వస్తే ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచించవచ్చునని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
పారిపోయి విలువల గురించి లెక్చర్!
టీవీ9 వాటాల వివాదంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్... సమాజం, విలువలంటూ మరోసారి ఉపదేశమిచ్చారు. కేసులకు భయపడి తెలంగాణ వదిలి పారిపోయిన ఆయన.. పోలీసులపై, ఈ వివాదంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల నేపథ్యం గురించి బుధవారం రవిప్రకాశ్ మీడియాకు మరో వీడియోను విడుదల చేశారు. తనకు, కొత్త యాజమాన్యానికి ఎక్కడ విభేదాలు వచ్చాయి? అవి ఎలా మొదలయ్యాయి? అంటూ వీడియోలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తనకు, సిటీనటుడు శివాజీ మధ్య తలెత్తిన వాటాల వివాదం ఎన్‌సీఎల్‌టీ పరిధిలో ఉండగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.
ఈ విషయంలో తెలంగాణ పోలీసులది అజ్ఞానమని అక్కసువెళ్లగక్కారు. కొన్ని మీడియా సంస్థలు తనను ఉగ్రవాదితో పోలుస్తూ పారిపోయానంటూ వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాకు పాఠాలు కూడా చెప్పారు. వీడియో సాంతం.. విలువలు, సమాజహితం అంటూ పదేపదే వల్లె వేసిన రవిప్రకాశ్... ఇంతకీ తానెందుకు పారిపోయానన్నది మాత్రం చెప్పలేదు. కోర్టులపై, చట్టాలపై విజ్ఞత ప్రదర్శిస్తూనే పోలీసులను ఎందుకు తప్పుబడుతున్నదీ మాత్రం చెప్పలేకపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో మీడియా మీద పడటం, వార్తల విషయంలో హితబోధ చేస్తూ అక్కసును బయటపెట్టుకున్నారు.
వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు..
రవిప్రకాశ్ వీడియో బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడి యోను ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు అప్‌లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సిమ్‌కార్డులు, ఫోన్లు మారుస్తూ పోలీసులకు తన జాడ చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవిప్రకాశ్‌కు ఈ వీడియో తీయడంలో ఎవరైనా సాయం చేశారా? అతని ఫోన్ నుంచే అప్‌లోడ్ చేశారా? అనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే వారు పురోగతి సాధించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment