సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షల సంఖ్య అప్పుడప్పుడూ అనూహ్యంగా తగ్గినా.. తగ్గలేదంటూ తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించి ఫూల్స్‌ను చేయాలని చూస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ ఆదేశాల అమలుకు సంబంధించి ప్రభు త్వం సమర్పించిన నివేదిక అస్పష్టంగా, అసమగ్రంగా, తప్పుల తడకగా ఉందంటూ ఆగ్ర హం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య ఆరోగ్య సిబ్బం ది రక్షణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కరోనా బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణకు సంబంధించి దాఖలైన 20కి పైగా ప్రజాహితవ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. తదు పరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది.
ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు?
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 1.20 లక్షల పరీక్షలు చేస్తోంది. కరోనా చికిత్స కోసం 581 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో కేవలం 62 ఆసుపత్రులనే కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 1,029, తమిళనాడులో 1,809 ఆసుపత్రులను కేటాయించారు. తెలంగాణలో ఆసుపత్రుల సంఖ్యతోపాటు పరీక్షల సంఖ్యనూ గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి వెయ్యి మందిలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య తెలంగాణలో 1.3గానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కనీసం 3 బెడ్స్ ఉండాలి. తెలంగాణలో శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్య పెంచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
నవంబర్ 16లోగా నివేదిక ఇవ్వండి...
‘‘బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సమావేశమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభు త్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే కరోనా రెండో దశలో విజృంభించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మా ఆదేశాల అమలుపై నవంబర్ 16లోగా సమగ్ర నివేదిక సమర్పించండి’’అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరణాల లెక్కలపై అనుమానాలు...
‘‘రాష్ట్రంలో కరోనా కేసులు వందల్లో ఉన్న రోజుల్లోనూ రోజువారీ కరోనా మరణాల సంఖ్య 10–13 మాత్రమే ఉందన్నారు. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా ఇప్పుడూ అన్నే మరణాలు నమోదవుతున్నాయని మీడియా బులెటిన్‌లో పేర్కొంటున్నారు. ఇది వాస్తవ సమాచారం కాదని భావిస్తున్నాం. శ్మశానవాటికల నిర్వాహకులను రోజూ ఎన్ని కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే మరణాల సంఖ్య ఎంతో తెలియాల్సిన అవసరం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను మరోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించాల్సి ఉంటుంది’’అని ఈ కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలను అమలు చేయండి...
- జూలై 1 నుంచి అక్టోబర్ 10 వరకు ఢిల్లీ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎన్ని పరీక్షలు నిర్వహిస్తే ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి? కరోనాతో ఎందరు మరణించారనే వివరాలతోపాటు రాష్ట్రంలో అదే కాలానికి చేసిన పరీక్షలు, నమోదైన కేసులు, మరణాల సంఖ్యను గ్రాఫ్ రూపంలో నివేదిక సమర్పించండి.
- రాష్ట్రవ్యాప్తంగా 1,135 వెంటిలేటర్ బెడ్స్ ఉండగా ఇటీవల 135 బెడ్స్ పెంచామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పడకలు సరిపోవు, వాటిని మరింతగా పెంచండి.
- గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను తెలిపేలా లైవ్ డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న మా ఆదేశాలను ఇప్పటికైనా అమలు చేయండి.
- ప్రస్తుతమున్న 17 ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షా కేంద్రాలకు మరో 6 కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఎప్పటిలోగా ఏర్పాటు చేసేదీ చెప్పలేదు. త్వరలో అంటే రెండు రోజులా, రెండు నెలలా, రెండేళ్లా? కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్న దృష్ట్యా వాటిని మరింతగా పెంచండి.
- ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై నివేదిక సమర్పించాలని ఆదేశించినా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎందుకు సమర్పించలేదు? తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment