బ్యాంకు ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న డాక్టర్ దీప్తి, వైద్య సిబ్బంది
హైదరాబాద్ (సుల్తాన్‌బజార్): కోఠి బ్యాంక్‌స్ట్రీట్ ఎస్‌బీఐ లోకల్ హెడ్ ఆఫీస్‌లోని కమర్షియల్ బ్రాంచ్‌లో మెసెంజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగి కరోనాæతో సోమవారం మృతి చెందాడు. కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతంలో నివసించే (57) సంవత్సరాల వ్యక్తి ప్రతిరోజు బ్యాంకుకు వచ్చే వినియోగదారులు ఇచ్చే వోచర్లను బ్యాంకు ఉద్యోగులకు అందజేస్తుంటాడు. అతనికి కొంత కాలంగా జ్వరం, దగ్గు వస్తుండటంతో సెలవులో ఉన్నాడు. ఈ నెల 14న బ్యాంకులోని డిస్పెన్సరీకి వెళ్లి మందులు తీసుకున్నాడు.
జ్వరం తగ్గకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా, గాంధీకి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో నింబోలిఅడ్డా కామ్‌ఘర్‌నగర్‌లోని అతని కుటుంబసభ్యులతో పాటు ఎస్‌బీఐ కమర్షియల్ బ్యాంక్‌లో పని చేసే 60 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్ చేశారు. ఉద్యోగుల ఫోన్ నంబర్‌లు, ఇంటి అడ్రస్‌లు వైద్య సిబ్బంది సేకరించారు. జ్వరం, దగ్గు వస్తే తమను సంప్రదించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు వేయి మంది విధుల నిర్వహణ...
ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్ బ్రాంచ్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా రావడంతో ఆ బ్యాంక్‌లో పనిచేసే దాదాపు వేయి మంది ఉద్యోగులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. వారితో పాటు కమర్షియల్ బ్రాంచ్‌లో పనిచేసే 60మంది సైతం వణికిపోతున్నారు. ఎస్‌బీఐ అధికారులు ఉద్యోగులను ఖాళీ చేయించి బ్యాంకు మొత్తం శానిటైజ్డ్ చేయించారు. ఇదిలా ఉండగా, కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడితో కాంటాక్ట్ అయిన వారికి కరోనా సోకితే వందల సంఖ్యలో బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా
చంచల్‌గూడ: సంతోష్‌నగర్ సర్కిల్ మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుర్మగూడ బస్తీలో నివసించే ఓ 75 ఏళ్ల వృద్ధుడికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అతని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం మరో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. వృద్ధుడి నుంచి ఇతర కుటుంబసభ్యులకు సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన ఆశా వర్కర్‌లకు చేదు అనుభవం ఎదురైంది. పరీక్షలు వద్దంటూ స్థానికులు వారిని దూషించి వెనక్కు పంపినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మాదన్నపేట పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment