వెనుదిరుగుతున్న అంబులెన్స్‌లు.. బయటకు వస్తున్న మరో పేషెంట్
సాక్షి హిమాయత్‌నగర్: బద్వెల్ నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాదవ్‌రావు(65)ను అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 70శాతం ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కుటుంబ సభ్యులు అతడిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 45 నిమిషాల తర్వాత ఒక నర్సు వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చెక్ చేయగా.. 72 ఉంది. అడ్మిట్ చేసుకుంటారో.. లేదో అనే ఆందోళనతో అదే అంబులెన్స్‌లో గంటల తరబడి వేచి చూశారు. గంటన్నర తర్వాత వెంటిలేటర్ లేదనడంతో తిరిగి మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఓ పక్క భర్త పరిస్థితి చూడలేక.. మరో పక్క బెడ్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌తో భార్య కన్నీటి పర్యంతమైంది..
మరో ఘటనలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 82 ఉంది. వెంటిలేటర్ బెడ్ లేదన్నారు. ఇంకో ఘటనలో యువకుడి పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. చేర్చుకోలేమని పంపేశారు. ఇదీ కింగ్‌కోఠి ఆస్పత్రిలో వెంటిలేటర్ బెడ్లు లేక రోగులు, రోగుల బంధువులు పడుతున్న అవస్థలు. గాంధీ ఆస్పత్రిలోని బెడ్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తే నయం అవుతుందనే నమ్మకంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తున్న రోగులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పడకలన్నీ ఫుల్ కావడంతో గాంధీకి వెళ్లిపోండంటూ మోహంపై చెప్పేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే గంటన్నర వ్యవధిలో 12మంది పేషెంట్లు కింగ్‌కోఠికి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు.
వారంలో వందకు పైగా..
ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. వచ్చిన వెంటనే ఇక్కడ బెడ్స్ లేవమ్మా.. వెళ్లిపోండి. టైం వేస్ట్ చేసుకోవద్దంటున్నారు. తిరిగి గాంధీకి వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రిని భరించలేక వెనుదిరుగుతున్నారు. ఇలా వారం రోజుల్లో సుమారు 100మందికి పైగా సీరియస్ కండీషన్‌లో ఉన్న వారు తిరిగి వెళ్లిపోయారు.
వెంటిలేటర్లు పెంచితే..
కింగ్‌కోఠి ఆస్పత్రి చాలా విశాలంగా, సామర్థ్యం కలిగిన ఆస్పత్రి. ఇక్కడ సదుపాయాలను గుర్తించి ప్రభుత్వం వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేయగలిగితే ఎందరో ప్రాణాలను రక్షించినవారవుతారు. కేవలం వెంటిలేటర్ బెడ్స్ లేక నిస్సహాయ స్థితిలో వెనుదిరుగుతున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఒకరు చనిపోతే.. లేదా డిశ్చార్జి అయితేనే మరొకరిని వెంటిలేటర్‌పైకి తీసికెళ్లే పరిస్థితి కింగ్‌కోఠిలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘చాలా మంది వెళ్లిపోతున్నారు’
ఎంతమంది వస్తున్నారు.. ఎంతమంది వెళ్లిపోతున్నారనేది చెప్పలేం. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86కంటే ఎక్కువ ఉంటేనే మేం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి వెంటిలేటర్ బెడ్స్ అన్నీంటిలోనూ పేషెంట్లు ఫుల్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీపై వస్తున్న వారిని తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నవరకు మేం పేషెంట్లకు నయం చేసి బయటకు పంపిస్తున్నాం.
– డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి
చదవండి: లాక్‌డౌన్ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment