సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్ చర్యలు తీసుకోకపోగా వారి వినతి మేరకు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో శాసన సభ స్పీకర్, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను (వ్యక్తిగత హోదాలో) ప్రతివాదులుగా చేశారు. ఈ కేసు విచారణ ఆవశ్యకతను సోమవారం హైకోర్టు దృష్టికి పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తీసుకొచ్చారు. గతంలో దాఖలు చేసిన ఇదే తరహా కేసు విచారణ మంగళవారం విచారణకు రానుందని చెప్పడంతో రెండింటినీ కలిపి రేపు విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
పార్టీ విలీన అధికారం ఈసీకే ఉంది..
‘పార్టీ పిరాయింపులపై చర్య తీసుకునే అధికారం కేంద్రం ఎన్నికల సంఘానికే ఉంది. శాసనసభ స్పీకర్ కు అధికారం లేకపోయినా విలీనం చేసి చట్ట ఉల్లంఘ నకు పాల్పడ్డారు. ఈ చర్య రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనలనే కాకుండా 102, 191, 324 అధికరణాల ఉల్లంఘన. న్యాయ సమీక్ష చేస్తే స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘన బట్టబయలు అవుతుంది. ఎర్ర బెల్లి దయాకర్‌రావు–తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల కేసులో సుప్రీంకోర్టు.. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా పరిష్కరించాలని స్పీకర్‌కు ఇచ్చి న ఆదేశాలు ఈ కేసులో అమలు చేసేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలి. స్పీకర్ తీసుకున్న విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలి. స్పీకర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్ర టరీ విడుదల చేసిన బులిటెన్ 10 అమలును సస్పెండ్ చేయాలి. పార్టీ ఫిరాయించిన 12 మందిపై ఉన్న అనర్హత ఫిర్యాదును విచారించి నిర్ణయం తీసుకున్న తర్వాతే స్పీకర్ ఇతర అంశాలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి’ అని హైకోర్టును కోరారు.
తెర వెనుక టీఆర్‌ఎస్ అధినేత కుట్ర..
‘ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలనే ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ స్పీకర్/కౌన్సిల్ చైర్మన్‌లకు రాజకీయపార్టీల విలీనం పై నిర్ణయం తీసుకునే అధికారంలేదు. స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలనే ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉండగా స్పీకర్ తన పరిధిలోకి రాని విలీన అంశంపై నిర్ణయం తీసుకుని చట్టాన్ని ఉల్లంఘించారు. విలీనంపై స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 6న అసెంబ్లీ బులిటెన్ (నంబర్ 10) విడుదల చేసింది. ముందుగా మా వాదన వినాలని స్పీక ర్ వద్ద కేవియట్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. కేవియట్ ప్రకారం తమకు నోటీసు ఇచ్చి విచారించాకే నిర్ణయం తీసుకోవాలన్న చట్ట నిబంధనలకు స్పీకర్ తిలోదకాలిచ్చారు.
రాజేంద్రసింగ్ రాణా,స్వామిప్రసాద్ మౌర్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శుల చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలి. యూపీలో బీఎస్పీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పెండింగ్ విషయంలో కేవియట్ దాఖలైతే ఆ మేరకు స్పీకర్ అమలు చేశారు. పదో షెడ్యూ ల్ పేరా 4, సబ్ పేరా 2 కింద విలీనానికి తమకు అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్ నేత స్పీకర్‌కు తెలప డం విడ్డూరంగా ఉంది. ఆ 12 మంది ఎమ్మెల్యేలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాం ఇచ్చే అధికారాన్ని టీఆర్‌ఎస్ ఇచ్చిందంటే విలీనానికి ముందే టీఆర్‌ఎస్ కుట్ర స్పష్టంగా కనబడుతోంది. దీని వెనుక టీఆర్‌ఎస్ అధినేత ఉన్నారు’ అని రిట్‌లో పేర్కొన్నారు.
పౌరుడు కూడా ఫిర్యాదు చేయవచ్చు..
పార్టీ ఫిరాయింపుల చట్టం(1986) ప్రకారం కూడా స్పీకర్ వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ శాననసభాపక్షానికి తేడా లేదు. సీఎల్పీ విలీనానికి పార్టీ ఆమోదం ఉండాలనే తమ అభ్యర్థను స్పీకర్ పట్టించుకోలేదు. స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీలు చట్టవ్యతిరేకంగా వ్యవహరించారు. ఒడిశా అసెంబ్లీకి సంబంధించి ఉత్కల్ కేసరి ఫరిడా కేసును ఉదహరిస్తూ ఒడిశా అసెంబ్లీలో 2013లో ఉన్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజూ జనతాదళ్‌లో కలిసిపోతే ఫిర్యాదు చేసేందుకు ఒక్కరూ మిగలలేదు. టెన్త్ షెడ్యూల్‌లోని పేరా 2 (1ఎ) ప్రకారం వారు అనర్హులు. స్పీకర్ ఎదుట ఫిర్యాదు లేకపోవడంతో వారంతా ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హత ఉంటుంది. ఈ విధానం 10వ షెడ్యూల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని రూల్ 6 ఆఫ్ 1987 (సబ్ రూల్ 1,2) ప్రకారం పౌరుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.. అని కూడా రిట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment