
సాక్షి, హైదరాబాద్: రహదారులపై టోల్ ట్యాక్స్ వసూళ్ల నుంచి మినహాయింపు పొందిన వీఐపీలు, వీవీఐపీల వివరాలు అందజేయాలని ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు వసూలు చేయొద్దంటూ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది డి.విద్యాసాగర్, ఇతరులు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
వీవీఐపీల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని, సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం నాలుగు వారాలు వాయిదా వేసింది.