
సాక్షి, హైదరాబాద్: గిరిజన సలహా మండలి తీర్మానాలను 2013 నుంచి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గిరిజన ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనీసవసతులు కూడా కల్పించడం లేదంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ దాఖ లు చేసిన ప్రజాహిత వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం వైద్యం అందడం లేదు. ప్రాథమిక వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లు లేవు. విద్యుత్, రవాణా వంటి కనీస సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ, పోలీస్ అధికారులు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
గిరిజన సలహా మండలి 2013 నుంచి అనేక సిఫార్సులు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు’ అని పిటిషనర్ తరఫున న్యాయ వాది పీవీ రమణ వాదనలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment