
సాక్షి, హైదరాబాద్: ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో కూడిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం పట్ల సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని, కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించారని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పి.రవీందర్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు విచారించింది. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. సివిల్ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జోక్యం చేసుకున్నారని పేర్కొంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పిటిషనర్ గతంలోనే హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందినా పోలీసులు మూడేళ్లకు పైగా అమలు చేయకపోవడంతో అప్పటి, ప్రస్తుత సైబరాబాద్ పోలీస్ కమిషనర్లపై కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
లలితాకుమారి–ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు అమలు చేయాలని 2015 నవంబర్ 7న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సైబరాబాద్ పోలీసులు బేఖాతరు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదించారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలని కోరారు. ‘గుర్తించదగ్గ నేరారోపణలున్న ఫిర్యాదులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. ఇలాంటి ఫిర్యాదులపై దర్యాప్తు కూడా అవసరం లేదు. ఈ కేసులో మూడేళ్లు దాటినా ఇప్పటివరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదో, పోలీసుల వైఖరి ఏంటో తెలియడం లేదు. ఈ నెల 21న జరిగే విచారణ సమయంలో కేసు పరిస్థితి ఏమిటో తెలియజేయాలి..’అని హైకోర్టు న్యాయమూర్తి సైబరాబాద్ కమిషనరేట్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment