
సాక్షి, హైదరాబాద్: సుజనా గ్రూప్ బినామీలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీఎస్ ఫెర్రస్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భరణి కమోడిటీస్, బీఆర్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్‌లకు ఊరటనిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. తాజాగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయొచ్చంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ చట్టంలోని 69(1), 132లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో సదరు కంపె నీలు ఇచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్య లు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ అడిషినల్ సొలిసిటర్ జనరల్ కె.నటరాజ్, జీఎస్టీ స్టాండింగ్ కౌన్సిల్ బి.నర్సింహశర్మలు బుధవారం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బోగస్ ఇన్వాయిస్‌లతో రూ.225 కోట్ల మేర సదరు కంపెనీలు లబ్ధి పొందాయని జీఎస్టీ అధికారులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పంజాగుట్టలోని సుజనా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరపగా, ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, అందుకే ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని నర్సింహశర్మ చెప్పారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment