సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుగుతున్న గ్రూప్–2 ఇంటర్వ్యూలను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఈ అంశంపై గత నాలుగేళ్లుగా జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. దీనిపై వివాదం కొనసాగించడం మంచిది కాదని ధర్మాసనం పేర్కొంటూ గ్రూప్–2 నియామకాలపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గ్రూప్–2 నియామకాల కోసం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో లోపాలున్నాయని, కొందరు జవాబు పత్రాల్లో వైట్‌నర్ ఉపయోగించారని గతంలో కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ 2017 లో తీర్పు ఇచ్చింది. అయితే దీనిని తొలి జాబితాలో ఎంపికైన వారు సవాలు చేయగా.. 2019లో జస్టిస్ రామసుబ్రమణ్యం నేతృత్వంలోని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది.
ఈ డివిజన్ బెంచ్ తీర్పు ఆధారంగా టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్–2 అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభించింది. 45 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్‌లో ఊరట లభించిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్ రామసుబ్రమణ్యం ధర్మాసనం తీర్పు బాగుందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుని రాసిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
స్టేలతో జాప్యం దురదృష్టకరం..
ప్రభుత్వ రంగంలో జరిగే నియామక ప్రక్రియలో కేసులు, స్టేల కారణంగా జాప్యం జరుగుతుండటం దురదృష్టకరమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సింగిల్ జడ్జి ముగ్గు రు సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేసి 20 వేల ఆన్సర్ షీట్లను వారితో పరిశీలింపజేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు న్యాయవాదుల కమిటీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడం మంచిదని పిటిషన్‌ను తోసిపుచ్చారు.
యథావిధిగా గ్రూప్–2 ఇంటర్వ్యూలు
Published Tue, Jul 23 2019 1:51 AM | Last Updated on Tue, Jul 23 2019 1:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment