సాక్షి, హైదరాబాద్: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవహారంపై సుప్రీంకోర్టు వివరణ తీసుకొని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ప్రస్తావించి స్పష్టత తీసుకోవాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అప్పటివరకు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రిలోనే భద్రపర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వివిధ విచారణలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం స్పష్టత తీసుకోనవసరం లేదు: ఏజీ
అంతకుముందు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ మృతదేహాల్ని భద్రపరిచినట్లు సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఏమీ లేవన్నారు. శుక్రవారం మృతదేహాల్ని తీసుకువెళ్లేందుకు నిందితుల కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, ఎన్‌కౌంటర్‌పై సందేహాలు లేనందున సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. అయితే కోర్టుకు సహాయకారిగా నియమితులైన (అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి మాత్రం ఏజీ ప్రకటనలో స్పష్టత లేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం శుక్రవారం తెలుసుకుని వివరణ తీసుకోవాలని, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (16వ తేదీకి) వాయిదా వేయాలని కోరారు.
ఈ దశలో పిటిషనర్ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గ్రోవర్ వాదిస్తూ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు వాడిన పదాలను పరిశీలిస్తే ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సిట్ దర్యాప్తులపై స్టే ఇచ్చిందని, హైకోర్టులోని కేసులపై కాదన్నారు. మృతదేహాల భద్రత వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టాలని, శుక్రవారం తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి వివరణ పొందుతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు స్టే అంటే హైకోర్టు విచారణ సహా కావచ్చు. అయినా ‡మీడియాలో వచ్చిన కథనాలపై కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా స్పష్టమైన వివరణ ముఖ్యం కాబట్టి ప్రభుత్వమే సుప్రీంకోర్టు నుంచి వివరణ తీసుకోవాలి’అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment