
సాక్షి, హైదరాబాద్: సింగరేణియన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయనే వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రూ.2.11 కోట్ల మేరకు నిధుల మోసం జరిగిందని పేర్కొంటూ సొసైటీ మెంబర్ గుండం గోపి దాఖలు చేసిన కేసులో ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్, సింగరేణి కంపెనీ సీఎండీ, జీఎం (పర్సనల్), సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ మేరకు ఇటీవల నోటీసులు జారీ చేశారు.
గుండం గోపి వాదనలు వినిపిస్తూ.. సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్, సొసైటీ సెక్రటరీ ఆర్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌లు నిధుల్ని దుర్వినియోగం చేసినట్లుగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, సొసైటీ బ్యాంకు ఖాతాల్ని యథాతథంగా నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధ్యక్ష, కార్యదర్శులిద్దరికీ రాజకీయ పలుకుబడి ఉండటంతోనే నిధుల్ని దుర్వినియోగం చేశారనే తమ అభియోగాల్ని నమోదు చేయడం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేశారు.