సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణా నుంచి యాదాద్రిలో విముక్తి పొందిన మహిళలు, ఆడపిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లోని 26 మంది పిల్లల స్థితిగతులపై జూలై 9లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. యాదాద్రిలో పిల్లలకు పోలీసులు విముక్తి కల్పించి సంరక్షణ గృహాలకు తరలించారు. వారిలో 26 మంది ప్రజ్వల అనే ఎన్జీవో సంస్థ నిర్వహించే రక్షణ గృహంలో గత జూలై నుంచి ఉంటున్నారు. సంరక్షణ గృహంలో ఉన్న పిల్లల జీవన పరిస్థితులను తెలుసుకోవాలని భావిస్తున్నామని, పిల్లలకు ఏ ఆహారం అందజేస్తున్నారో, వారికి అవసరమైనప్పుడు ఏ మందులు వాడుతున్నారో, విద్యా బోధన ఎలా ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కిడ్నాప్, తప్పిపోయిన పిల్లలను వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. ఆ పిల్‌ను మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ వాదిస్తూ.. సంరక్షణ గృహంలో పిల్లలు క్షేమంగానే ఉన్నారని, రక్షణ దృష్ట్యా వారి ని పాఠశాలలకు పంపలేకపోతున్నామని చెప్పారు. అయితే ప్రజ్వల హోం నిర్వాహకులు అక్కడే వారికి విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. పిల్లలను తాము దత్తత తీసుకున్నామని చెప్పి కొంతమంది పిల్లలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుమతించడం లేదన్నారు. ప్రజ్వల హోం తరఫు న్యాయవాది దీపక్ మిశ్రా వాదిస్తూ.. హోంలో 150 మంది ఉండేందుకు సరిపడా వసతులున్నాయని, పిల్లలకు తగిన రీతిలో యోగక్షేమాలను నిర్వాహకులు చూసుకుంటున్నారని తెలిపారు. విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది.
ఆ పిల్లల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
Published Wed, Jun 26 2019 3:16 AM | Last Updated on Wed, Jun 26 2019 3:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment