సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహార చెక్కులు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఉన్న రెండు రిట్ పిటిషన్లను కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా 24న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కొండపోచమ్మ ప్రాజెక్టు భూసేకరణపై స్టే ఆదేశాలు ఉన్నా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించడం చెల్లదని ప్రకటించాలని కోరుతూ మామిడ్యాలకు చెందిన శ్రీనివాస్ మరో 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
చట్ట నిబంధనల ప్రకారం పునరావాసం, పునర్నిర్మాణ చర్యలు చేపట్టకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని, పిటిషనర్లను భూముల్లోకి వెళ్లనీయడం లేదని వారి తరఫు న్యాయవాది వాదించారు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత చర్యలు చేపట్టరాదని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారని, దీనిని ధిక్కరిస్తున్నారని చెప్పారు. పరిహారం చెల్లించకుండా రైతుల నుంచి భూములు ఎలా తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టం సెక్షన్ 181 కింద ఇచ్చిన నోటీసును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఈ పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఆదేశాలు వర్తించబోవన్నారు. ప్రాజెక్టు దాదాపు 80 శాతానికిపైగా పూర్తి అయిందని, ఇప్పటికే చాలా మంది రైతులకు ఇదే హైకోర్టులో పరిహార చెక్కులు ఇచ్చామని తెలిపారు.
గతంలోని మరో రెండు కేసులతో కలిపి ఈ రిట్‌ను కూడా 24న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పునరావాస చర్యలు అమలు నిమిత్తం తమ భూముల్ని సేకరించడం అన్యాయమని పేర్కొంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన రైతులు దాఖలు చేసిన అత్యవసర రిట్‌ను కూడా ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యాన్ని కూడా 24నే విచారిస్తామని, అప్పటివరకూ పిటిషనర్ల భూముల్ని స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే తరహాలో గతంలో దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ కేసును విచారిస్తామని ప్రకటించింది. నిర్వాసిత రైతులను ఆదుకునేందుకు ఇతర రైతుల భూముల్ని మళ్లీ సేకరించడం అన్యాయమని, ప్రభుత్వ భూమిలోనే పునరావాసం, పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.
విచారణకు ఆలస్యమెందుకు?
హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో ఖరీదైన భూమి విషయంలో నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) జారీ చేసిన కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌పై విచారణ చేయాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల అమల్లో జాప్యానికి కారణాలు చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించింది. జాప్యానికి కారణాలపై నివేదికను ఆగస్టు 5 నాటికి తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సర్వే నంబర్ 284/6లోని 5,262 చదరపు గజాల భూమికి తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్‌ఓసీ తీసుకున్నారని పేర్కొంటూ శాంతి అగర్వాల్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌ఓసీ చట్ట నిబంధనలకు అనుగుణంగా జారీ చేయలేదని, ఇందుకు కారణమైన కమిటీ చైర్మన్, ఇతర సభ్యులపై, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్‌ఓసీ తీసుకున్న మహ్మద్ అబ్దుల్ వదూద్, మహ్మద్ రుక్ముద్దీన్, సయ్యద్ అబ్దుల్ రబ్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
అప్పటి కమిటీకి చైర్మన్‌గా నవీన్ మిట్టల్, సభ్యులుగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ వి.దుర్గాదాస్, రిటైర్డు స్పెషల్ తహసీల్దార్ వి.వి.వెంకట్‌రెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ మధుసూదన్‌రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఆరు వారాల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం విచారణను వచ్చే ఆగస్టు 5కి వాయిదా వేసింది. శాఖాపర విచారణ జాప్యంపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment