హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపర్చేందుకు గిరిజనులను తీసుకువస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొలంగొండి గ్రామానికి చెందిన 67 మంది ఆదివాసీలను పునరావాస చర్యలు తీసుకోకుండానే అటవీ ప్రాంతం నుంచి బలవంతంగా తరలించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మందికి చెందిన 16 కుటుంబాల పెద్దలను అటవీ అధికారులు ధర్మాసనం ఎదుట ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామన్న హామీల్ని నమోదు చేసిన ధర్మాసనం వాటి అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. వాకెండిలోని ప్రభుత్వ వసతి గృహంలో 67 మంది ఆదివాసీలకు వసతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేయాలి. ఏడాదిలోగా వారందరికీ శాశ్వత వసతి గృహాల్ని నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వం గుర్తించిన 91 ఎకరాల్ని ఆరు నెలల్లోగా బాధితులు 67 మందికి కేటాయించాలి. భూములు సాగు చేసుకునేందుకు వీలుగా ఇరిగేషన్ శాఖ బోర్లు ఇతర వసతులు కల్పించాలి. బాధితుల పశువుల్ని తిరిగి ఇచ్చేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ అమలుచేసే వరకూ బాధితులకు ఆహారం, తాగునీరు, విద్య, వైద్యం, గర్భిణీలకు ప్రత్యేక వసతులు కల్పించాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గోడువెళ్లబోసుకున్న ఆదివాసీలు
ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించారంటూ తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. హైకోర్టు ఆదేశాల మేరకు 16 మంది కుటుంబ పెద్దలను ఆదివారం సాయంత్రం 5 గంటలకు పర్యాటక శాఖ బస్సుల్లో తీసుకువచ్చి న్యాయమూర్తుల ఎదుట హాజరుపర్చారు. ఆదివాసీయులు చెప్పే సాక్ష్యాలను అనువాదం చేసేందుకు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ జి.మనోజ కూడా విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వి.రఘునాథ్ వాదించారు. ధర్మాసనం ఎదుట.. ఆదివాసీ పెద్దల్లోని ఆత్రం భీము, సిడెం పువా అనే ఇద్దరు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ‘ఈనెల 12న తాము పూజ చేసేందుకు వెళ్లినప్పుడు అటవీ అధికారులు వచ్చి గూడెంలోని మా గుడిసెల్ని కూల్చేశారు. పశువుల పాకల్ని కూడా పీకేశారు. మమ్మల్లి వేంపల్లి ఫారెస్ట్ డిపోలో పెట్టారు. అక్కడేమీ వసతులు లేవు. తాగేందుకు నీరు, తిండికి కూడా ఇబ్బంది పడ్డాం’అని చెప్పారు. జస్టిస్ షమీమ్ అక్తర్ వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదించి ఏసీజేకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. వారిని మనుషులనుకుంటున్నారా.. పశువుల్ని చూసినట్టు చూస్తారా.. అని వ్యాఖ్యానించింది.
దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు శ్రీకాంత్, మనోజŒ మాట్లాడుతూ, వారు మహారాష్ట్ర నుంచి వచ్చి రిజర్వుడ్ ఫారెస్ట్‌ను ఆక్రమించుకున్నారని, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతం నుంచి అందరినీ ఖాళీ చేయించామని చెప్పారు. పునరావాస చర్యలు ప్రారంభించామని, హైకోర్టు ఆదేశాల మేరకు పునరావాసం కల్పించే వరకూ వారందరికీ వసతి, ఇతర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆక్రమణదారులను తొలగించాలన్నా చట్ట ప్రకారం చేయాలని, పునరావాసం కల్పించకుండానే వారందరినీ అక్కడి నుంచి తరలించడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫారెస్ట్ డిపోలో వారిని పెడితే ఎలాగని, మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని, బాధితులకు అన్ని పునరావాస చర్యలు తీసుకునే వరకూ ప్రభుత్వం వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోతే బాధితులు 67 మందిలో ఎవరైనాగానీ లేదా పిటిషనర్లుగానీ, వారి న్యాయవాదిగానీ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేసుకోవచ్చుననే వెసులుబాటు కల్పిస్తున్నామని ప్రకటించిన ధర్మాసనం, వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment