
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక కమిటీవేసి మార్గదర్శకాలు రూపొందించాలంటూ 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపామని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. కాగా, సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం తర్వాతే థియేటర్ యజమానులు పెంచుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ థియేటర్ యజమానులు దాఖలుచేసిన అప్పీళ్లను తర్వాత విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 26కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment