సినిమా షూటింగ్స్ అంటే లోకల్‌లోనే కాదు... నాన్ లోకల్‌లోనూ జరుగుతుంటాయి. దేశంతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణకు మేకర్స్ ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం భాగ్యనగరంలో (హైదరాబాద్) సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, నాని, ‘అల్లరి’ నరేశ్, నిఖిల్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలంతా హైదరాబాద్‌తో పాటు పరిసరప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్‌లో జోరుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం...
నాలుగో సారి...
హీరో బాలకృష్ణ–డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నిర్మించిన సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, ఆదిలపై చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉండనుంది. ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి.
ముచ్చింతల్‌లో వీరమల్లు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రొడక్షన్స్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోందని టాక్. పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్.
బిజీ రాజా
వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో జరుగుతోంది. చిత్ర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలతో ‘రాజా సాబ్’ యూనిట్ బిజీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ప్రత్యేకమైన సెట్‌లో...
ప్రభాస్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు ప్రభాస్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్, ఇతర లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతదర్శకుడు.
అల్యూమినియం ఫ్యాక్టరీలో...
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబుపై కొన్సి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్ తర్వాత కెన్యాలో షూటింగ్ ఆరంభం కానుందని టాక్. కాగా ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె హీరోయిన్‌గా కాదు.. విలన్ పాత్ర చేయనున్నారని తాజా టాక్.
పవర్‌ఫుల్ అర్జున్ సర్కార్
‘హిట్’ సినిమా సిరీస్‌లో వస్తోన్న మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. యునానిమస్‌ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్
పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కాశ్మీర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరించిన తర్వాత తాజా షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. హీరో, హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. మే 1న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్.
తప్పించుకోలేరు
‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఆర్ 63’ (వర్కింగ్ టైటిల్). ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నరేశ్ బర్త్‌డే సందర్భంగా జూన్ 30న ‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.
యుద్ధ వీరుడు
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్‌లో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్ర కోసం ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని జన్‌వాడలో జరుగుతోంది. హీరోతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రం ఈ వేసవిలో రిలీజ్ కానుంది.
ఏటిగట్టుపై సంబరాలు
‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హను మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియాప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరోతో పాటు ఇతర నటీనటులు షూట్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడంలో విడుదల కానుంది.
ఇవే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్, పరిసరప్రాంతాల్లో జరుగుతున్నాయి.
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆలయంలో ఈ నెల 14 నుంచిప్రారంభం కానుందట. ఈ సాంగ్ షూట్‌లో చిరంజీవితో పాటు హీరోయిన్లు పాల్గొననున్నారని టాక్. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు.
రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో ముగిసింది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై రాత్రి వేళ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ మూవీ చివరి రోజు షూటింగ్‌కి తన కుమార్తె క్లీంకారని రామ్‌చరణ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment