
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. శంకర్ దర్శకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తీసుకొని.. సినిమాను దారణంగా తీశాడని మండిపడ్డారు. అయితే ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరిస్టుల ఎంపిక కూడా ఒకటని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలకోసం మంచి గుర్తింపు ఉన్న నటీనటులను పెట్టాడు. పోనీ ఆ పాత్రలకు అయినా న్యాయం చేశాడా అంటే అదీలేదు.
చాలా మంది నటీనటులను ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకడు. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి కేవలం రెండు సీన్లలో వచ్చివెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై ప్రియదర్శి స్పందించాడు.
ఆయన నటించిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’లో తను అంత చిన్న పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ‘బలగం’ కథ వినకముందు ఓకే చేశాను. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తుండేవాడిని. గేమ్ ఛేంజర్‌లో కూడా అలాంటి పాత్రే. 25 రోజుల పాటు నేను కాల్షిట్లు ఇచ్చాను. షూటింగ్ చేశారు. కానీ ఎడిటింగ్‌లో ఆ సీన్లు మొత్తం తొలగించారు. నాది చిన్న పాత్ర అని తెలిసినా.. ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం శంకర్. అలాంటి డైరెక్టర్‌తో పని చేసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే చిన్న పాత్ర అయినా చేశాను. 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా తెరపై చూపించలేదు. శంకర్‌గారితో పని చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. దానికోసమే ఆ సినిమా చేశాను’అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment