సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రిజర్వాయర్ల సంరక్షణకు సంబంధించిన జీవో 111 పరిధి పునఃపరిశీలన, అధ్యయనంలో జాప్యంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 45రోజుల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా..ఇప్పటికీ ఇవ్వకపోవడమేంటని నిలదీసింది. 22వ శతాబ్ధంలో నివేదిక ఇస్తుందా అని ప్రశ్నించింది. అయితే చివరగా మరో అవకాశం ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. వచ్చే నెల 13లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. నివేదికపై ఆ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది.
వచ్చే నెల 13లోగా నివేదిక ఇవ్వకపోతే హైపవర్ కమిటీ రద్దవుతుందని, హైపవర్ కమిటీ చైర్మన్, సభ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలూ ఉంటాయని హెచ్చరించింది. ఇక క్యాచ్‌మెంట్ ఏరియా వెలుపల ఉన్న సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ.. ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ)’2006లో ఇచ్చి న నివేదికపైనా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జీవో 111 పరిధి అధ్యయనం, నివేదిక విషయాల్లో తీసుకోబోయే చర్యలను వివరిస్తూ.. హైపవర్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సీఎస్ వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక, దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ.. అక్టోబరు 3 లోగా స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను అక్టోబరు 4కు వాయిదా వేసింది.
రహస్య ఎజెండా ఏమైనా ఉందా?
జీవో 111 పరిధికి సంబంధించిన ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఏమైనా ఉందా అని విచారణ సందర్భంగా ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. ‘‘జీవో 111 పరిధిపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఈపీటీఆర్‌ఐని కోరింది. అధ్యయనం చేసిన ఈపీటీఆర్‌ఐ కొన్ని సర్వే నంబర్లు క్యాచ్‌మెంట్ వెలుపల ఉన్నాయని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 2010లో ఆ సర్వే నంబర్లను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది.
మళ్లీ 2016లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగేళ్లు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 6 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆ గడువు కూడా 2019 ఆగస్టు నాటికి ముగిసింది. అయినా కమిటీ నివేదిక ఇవ్వలేదు’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కాస్త గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
‘‘2019లో మరో కమిటీని ఏర్పాటు చేసినా కరోనా నేపథ్యంలో నివేదిక ఇవ్వలేకపోయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేస్తాం. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వండి’’అని నివేదించారు. కాగా.. పలు సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ 2006లో ఈపీటీఆర్‌ఐ ఇచ్చిన నివేదికను మున్సిపల్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment