సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంపై 111 జీవో ఎత్తివేత ప్రభావం గట్టిగానే పడనుంది. చదరపు అడుగు (చ.అ.) రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కస్టమర్లు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ ధర పెట్టి అపార్ట్‌మెంట్లలో కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని గ్రామాలలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హైరైజ్, లగ్జరీ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమంలో 50 వేల యూనిట్లు..
హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పశ్చిమ హైదరాబాద్ కీలకమైనది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల కారణంగా ఈ ప్రాంతాలలో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఏటా హైదరాబాద్‌లోని రియల్టీ క్రయవిక్రయాలలో వెస్ట్ హైదరాబాద్ వాటా 60 శాతం ఉంటుంది. కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటివి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో సుమారు 10 కోట్ల చ.అ.లలో నివాస సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో రద్దుతో ఆయా ప్రాజెక్ట్‌ల డెవలపర్లు డోలాయమానంలో పడ్డారు.
ప్రీలాంచ్ నిర్మాణాలకు బ్రేక్..
కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి వెస్ట్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో డెవలపర్లు ప్రీలాంచ్‌లో విక్రయాలు చేశారు. ధర తక్కువకు వస్తుంది కదా అని కొనుగోలుదారులూ ఎగిరి గంతేసి బిల్డర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్‌లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. గత 3–4 నెలలుగా మార్కెట్ ప్రతికూలంగా మారడంతో లగ్జరీ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. విక్రయాలు లేకపోవటం, నిధుల లేమి కారణంగా చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. తాజాగా 111 జీవో రద్దు ప్రకటించిన నాటి నుంచే పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రీలాంచ్‌లోని పలువురు కస్టమర్లు డెవలపర్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డెవలపర్లను కోరుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి తెలిపారు.
స్పష్టత వచ్చేదాక స్తబ్ధుగానే..
జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111ను ప్రభుత్వం ఎత్తేసి 69 జీవో తీసుకొచ్చినా స్థానిక భూ యజమానులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వెంటనే భూములు అమ్మడానికి ఆసక్తి చూపడంలేదు. నగరానికి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో మునుముందు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ జోన్, బఫర్ జోన్‌లు చేస్తామని ప్రకటించింది. దీంతో ఏయే ప్రాంతాలు గ్రీన్ జోన్‌లో ఉంటాయి? ఏ ప్రాంతాలు బఫర్ జోన్‌లో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు భూములు ఎందుకు అమ్ముకోవాలని రైతులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరాల కోసం కొందరు రైతులు భూములు అమ్మకానికి పెట్టినా గతం కంటే ఎక్కువ ధరలే చెబుతున్నారు. జీవో 69 విధివిధానాలను మాత్రం ఖరారు చేయలేదు. భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై స్పష్టత వస్తే ఇక్కడి భూములకు మరింత గిరాకీ ఉంటుంది.
ప్రభావిత ప్రాంతాలివే..
కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, ఖానామెట్, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి 111 జీవో పరిధిలోని 10 కి.మీ. క్యాచ్‌మెంట్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెండున్నర దశాబ్ధాల కలను ప్రభుత్వం సాకారం చేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే.. కానీ, ఆ ఫలాలు నిజంగా స్థానిక రైతులకు అందుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్మాణ నిబంధనల సాకు చూపి ఇప్పటికే 60 శాతానికి పైగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో జీవో రద్దు ఫలాలు ఎవరికి దక్కుతాయనేది సుస్పష్టం.
Comments
Please login to add a commentAdd a comment