హైదాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులకు స‍్వర్గధామంగా నిలిస్తోంది. ప్రాపర్టీల (స్థిరాస్తి) ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రతిరూపాయి లాభాలు కురిపిస్తాయనే అభిప్రాయంతో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు ఇళ్ల డిమాండ్, ఎకానమీ వృద్ది, నగరం నలువైపులా మౌలిక సదుపాయల అభివృద్ది వంటి సానుకూల అంశాల కారణంగా దేశంలో బడ్జెట్ ధరల్లో ప్రాపర్టీలు సొంతం చేసుకునే 6 నగరాల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ ప్రధమ స్థానంలో నిలిచింది.
ఇటీవల ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ దేశంలో ప్రముఖ నగరాలైన ఢిల్లీ- ఎన్‌సీఆర్,కోల్‌కతా, ముంబై, పూణే, హైదాబాద్, చెన్నై, బెంగళూరులలో సగటున స్థిరాస్థి (ప్రాపర్టీ) ధరలు ఎంతున్నాయోనని పోల్చి చూసింది. అనరాక్ సర్వేలో ఇతర నగరాలకంటే హైదరాబాద్‌లో చౌకగా స్థిరాస్థి ధరలు ఉన్నట్లు తేలింది. నగరంలో యావరేజ్‌గా ఒక్కో చదరపు అడుగు ధర రూ.4,620 గా ఉందని తెలిపింది.
ఇక హైదరాబాద్‌లో రియల్ రంగం స్థిరంగా కొనసాగేందుకు నివాసగృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయలకు డిమాండ్ పెరగడం,ఏరియాల మధ్య దూరాన్ని తగ్గించేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చేయడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ‍్చినట్లైంది.
తద్వారా హైదరాబాద్‌లో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్టంగా 10 శాతం పెరుగుదల నమోదైంది. ఇప్పటికీ మిగిలిన నగరాలతో పోలిస్తే అనువైన ధరల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ భారతదేశంలో అత్యంత సరసమైన నగరాలలో ఒకటిగా నిలిచింది.
2018 హైదరాబాద్‌లో స్కైర్ ఫీట్ సగటు ధర రూ.4,128గా ఉంది. ఇది 2022లో రూ.4,620కి పెరిగింది. ఇక గడిచిన ఐదు సంవత్సరాల్లో 7 నగరాల్లోని యావరేజ్‌గా స్కైర్ ఫీట్ ప్రాపర్టీ ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే.. ముంబైలో స్కైర్ ఫీట్ ధర అత్యధికంగా రూ.11,875 ఉండగా పూణేలో రూ.6వేలు, బెంగళూరులో రూ.5,570, చెన్నైలో రూ.5,315, ఎన్‌సీఆర్ రూ.5,025, కోల్‌కతాలో రూ.4,700, హైదరాబాద్‌లో రూ.4,620గా ఉన్నాయి.
ఈ సందర్భంగా 2022లో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్ట వార్షిక పెరుగుదల కనిపించిందని, అనరాక్ గ్రూప్‌లోని రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు. మహమ్మారి తర్వాత నగరాల్లో డిమాండ్ పెరిగింది. 2021-2022లలో డెవలపర్‌ల ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ధరలు పెరగడానికి కారణమైనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment