హైదరాబాద్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో.. ప్రారంభం ఎప్పటి నుంచంటే | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో.. ప్రారంభం ఎప్పటి నుంచంటే

Published Sat, Jan 27 2024 7:59 AM

Credai Property Show From March 8 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వచ్చే 2–3 ఏళ్లలో 1.30 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ప్రతినిధులు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, కొంపల్లి, శామీర్‌పేట్‌ వంటి ప్రాంతాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.

నగరంలో ఐటీ కేంద్రాలు, ఔట్‌సోర్సింగ్‌ సెంటర్లు, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు, బహుళ జాతి సంస్థలు ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను స్థాపించడానికి నగరంలో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్‌ మరింత పెరిగిందని, 2022లో 10 కోట్ల చ.అ. లావాదేవీలను అధిగమించగా.. 2023లో 11.9 కోట్ల చ.అ.లకు దాటిందని వివరించారు. మార్చి 8–10 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో జరగనుంది.

ఈ సందర్భంగా క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ వీ రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని, స్థిరాస్తి ధరలు పెరుగుతున్నప్పటికీ నగరం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని తెలిపారు. క్రితం సంవత్సరంతో పోల్చితే 2023లో ప్రాపర్టీ లావాదేవీలలో 25 శాతం వృద్ధి నమోదయిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుందని, ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని చెప్పారు.

మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే క్రమంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ కారిడార్‌ అభివృద్ధి, టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి చోదకశక్తి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ ఎన్‌ జైదీప్‌ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 3.5–3.8 కోట్ల చ.అ.లలో హై–క్వాలిటీ బిజినెస్‌ పార్కులు రానున్నాయని, దీంతో వచ్చే రెండేళ్లలో స్థిరాస్తి రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. 

నేడే బీఏఐ కన్వెన్షన్‌ హైటెక్స్‌లో ఆల్‌ ఇండియా బిల్డర్స్‌ కన్వెన్షన్‌ 
బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్‌ ఇండియా బిల్డర్స్‌ కన్వెన్షన్‌ 31వ సదస్సు (ఏఐబిసి)– 2024 మాదా పూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ప్రారంభంకానుంది. మూడు రోజుల ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. గౌరవ అతిధులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హాజరవుతారు. నిర్మాణ రంగంలో అధునాతన సాంకేతికత వినియోగం వంటి పలు అంశాలపై చర్చలు, ప్రదర్శనలుంటాయి. బీఏఐ జాతీయ అధ్యక్షులు ఎస్‌ఎన్‌ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య, రాష్ట్ర అధ్యక్షులు కె.దేవేందర్‌ రెడ్డిలు తదితరులు పాల్గొననున్నారు.   

Advertisement
Advertisement