
సాక్షి, హైదరాబాద్: జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉందా లేదా.. అన్న దానిపై స్పష్టతనివ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరు నెలల్లో జీవో 111ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకొని చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఒకవేళ ప్రభుత్వానికి జీవో 111ను రద్దు చేసే ఉద్దేశం ఉంటే, దాని పరిధిపై దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
బుధవారంలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఏఏజీకి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. జీవో 111 నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూములను వేలం వేయొద్దని ధర్మాసనం సూచించింది.
కోకాపేటలో భూముల వేలంలో కొనుగోలు చేసినవారు... అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలంటే డ్రైనేజీ, వరదనీటి తరలింపునకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాతే అనుమతులు ఇస్తామని తెలియజేయాలని ధర్మాసనం హెచ్‌ఎండీఏకు సూచించింది. ‘‘కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఒకలాగా... వట్టి నాగులపల్లిలోని ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో మరోలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.