State government plan
-
Telangana: నిధుల ‘మైనింగ్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో సంస్కరణల ద్వారా ప్రస్తుత ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం మైనింగ్ రంగం ద్వారా రూ. 3,612 కోట్ల ఆదాయం వస్తుండగా సంస్కరణల తర్వాత ఈ ఆదాయం రూ. 7,518 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఉప సంఘం మైనింగ్ రంగానికి చెందిన వివిధ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశముంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ. 3,906 కోట్లు సమకూరుతాయి. లేటరైట్, రోడ్ మెటల్, మొరం, మార్బుల్, క్వారŠట్జ్ వంటి మైనర్ మినరల్స్‌ను వేలం వేయడం, సీనరేజి, డెడ్ రెంట్ శాతాన్ని పెంచడం ద్వారా రాబడి పెరుగుతుందనే ప్రధాన సంస్కరణలను కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. వాటితోపాటు పర్యావరణ ప్రభావ (ఈఐ) ఫీజు పెంపు, ఈఐ విస్తీర్ణం తగ్గింపు, ఇసుకపై సీనరేజీ పెంపు, ఇసుక ధర అదనంగా రూ. 100 పెంపు, గ్రావెల్‌కు దరఖాస్తు ధర వంటి ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 260 కోట్ల మేర ప్రభావం చూపుతుందని మంత్రివర్గ ఉప సంఘం అంచనా వేసింది. సీనరేజీ ఫీజు పెంపుతో రూ.578 కోట్లు లీజు విస్తీర్ణంలో ఖనిజాల వెలికితీతపై విధించే సీనరేజి పన్నును మూడేళ్లకోసారి సవరించాల్సి ఉండగా 2015 సెప్టెంబర్ నుంచి సవరించలేదు. దీంతో ఇసుకను మినహాయించి ఇతర ఖనిజాల వెలికితీతపై 40–50 శాతం సీనరేజి పెంపు ద్వారా అదనంగా రూ. 578 కోట్లు రాబట్టవచ్చని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం సీనరేజీ ద్వారా రూ. 1,149 కోట్ల ఆదాయం వస్తుండగా పెంపుదలతో రూ. 1,727 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. వెలికితీసిన ఖనిజాల రవాణా అనుమతి కోసం కొత్తగా ‘పర్మిట్ ఫీజు’ను విధించాలని నిర్ణయించగా గ్రానైట్‌కు సీనరేజీలో 0.4 రెట్లు, ఇతర ఖనిజాలకు 0.8 రెట్లు వసూలు చేయడం ద్వారా రూ.1,219 కోట్లు రాబట్టవచ్చని సబ్ కమిటీ ప్రతిపాదించింది. క్వారీలో కార్యకలాపాలు జరగకున్నా మూసి ఉన్న కాలానికి వసూలు చేసే ‘డెడ్ రెంట్’ను గత ఆరేళ్లుగా సవరించలేదు. ఈ నేపథ్యంలో డెడ్ రెంట్‌ను వంద శాతం పెంచడం ద్వారా ఆదాయం రూ.94 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే మైనింగ్ లీజు రెన్యూవల్‌పై కూడా డెడ్‌రెంట్‌కు నాలుగు రెట్లు చార్జీలు వసూలు చేయడం ద్వారా రూ.29 కోట్లు, లీజు హక్కులను బదిలీ చేసేందుకు లీజు ఫీజు కింద రూ.14.48 కోట్లు రాబట్టాలని ప్రతిపాదించింది. లీజు, వేలం దరఖాస్తులకు ఫీజు వసూలు లీజు లేదా వేలం దరఖాస్తు ఫీజు ద్వారా రూ.25 కోట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెండింగులో ఉన్న కేసులను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి రూ. 206 కోట్లు సమకూర్చుకునే అవకాశం ఉందని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కృత్రిమ ఇసుక తయారీని ప్రోత్సహించడం ద్వారా రూ. 300 కోట్లు, సున్నపురాయి, మాంగనీసు వంటి మేజర్ మినరల్స్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ.565 కోట్లు, మైనర్ మినరల్స్ వేలం ద్వారా రూ.250 కోట్లు, లెటర్ ఆఫ్ ఇంటెంట్ల జారీ, ప్రస్తుత లీజులపై సెక్యూరిటీ డిపాజిట్ల ద్వారా అదనపు ఆదాయం రాబట్టాలని కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తే నిబంధనలు సవరించి కొత్త మైనింగ్ పాలసీని అమలు చేస్తామని మైనింగ్ విభాగం వర్గాలు వెల్లడించాయి. -
జీవో 111 రద్దు చేసే ఆలోచన ఉందా?
సాక్షి, హైదరాబాద్: జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉందా లేదా.. అన్న దానిపై స్పష్టతనివ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరు నెలల్లో జీవో 111ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకొని చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఒకవేళ ప్రభుత్వానికి జీవో 111ను రద్దు చేసే ఉద్దేశం ఉంటే, దాని పరిధిపై దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారంలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఏఏజీకి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. జీవో 111 నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూములను వేలం వేయొద్దని ధర్మాసనం సూచించింది. కోకాపేటలో భూముల వేలంలో కొనుగోలు చేసినవారు... అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలంటే డ్రైనేజీ, వరదనీటి తరలింపునకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాతే అనుమతులు ఇస్తామని తెలియజేయాలని ధర్మాసనం హెచ్ఎండీఏకు సూచించింది. ‘‘కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఒకలాగా... వట్టి నాగులపల్లిలోని ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో మరోలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www.teamtsic.telangana,gov.in/intinta-innovator-exhibition-2021 పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
పైసల్ ఇవ్వడమే కాదు.. తోడూనీడలా దళితబంధు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినబోతున్న దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. 16న (నేడు) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి సభ ద్వారా ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పథకం అమలులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా నూటికి నూరుపాళ్లు విజయవంతం చేయాలన్న సంకల్పంతో అధికారులు విధివిధానాలు, అమలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ముసాయిదా నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక రూపకల్పనలో మంత్రులు, ఐఏఎస్‌లు, దళిత మేధావులు, రాజకీయ నాయకులను కూడా భాగస్వాములను చేశారు. (చదవండి: దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్) ఈ పథకం కింద దాదాపు 30 వరకు వివిధ స్వయం ఉపాధి, వ్యాపార యూనిట్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ పథకం రూపొందించామని అధికారులు తెలిపారు. వారు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా నైపుణ్య కల్పన, మార్కెటింగ్ సదుపాయం, శిక్షణ, ఆర్థిక క్రమశిక్షణపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారు. దీనికోసం పలు ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ముందుగానే ఒప్పందం చేసుకోవడం గమనార్హం. వారి వ్యాపారంలో ఇబ్బందులు, సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యత రెండేళ్ల వరకు తీసుకుంటారు. అంతా సమగ్ర సర్వే ఆధారంగానే.. 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు తదితరాలపై పెద్ద డేటాబేస్‌నే ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న ప్రతీ పథకానికి ఇదే మూలం. ►లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక.. వారికి ఏ వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్ లేదా వాహన రంగాల్లో పూర్వానుభవం ఉందా? లాంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ మేరకు వారికి వ్యాపారం/ యూనిట్/ వాహనాలను కేటాయిస్తారు. పూర్వానుభవం లేనివారికి ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. ఉదా: పాడి గేదెలతో మినీ డైయిరీ యూనిట్‌కు కొందరు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి కేటాయించిన రూ.10 లక్షలు ఒకేసారి ఖర్చు చేయించరు. అవసరం మేరకు నిధులు ఖర్చు చేయించి యూనిట్ పెట్టిస్తారు. విజయ డెయిరీ సిబ్బందితో శిక్షణ ఇప్పిస్తారు. పాలను విజయ డెయిరీ వారే కొనేలా మార్కెటింగ్ కల్పిస్తారు. అలాగే ప్రతీనెలా వారికి డెయిరీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడేలా చూస్తారు. అందులోనూ పొదుపు, నిర్వహణ పోను.. ఖర్చులకు వాడుకునేలా లబ్ధిదారులకు అధికారులు సూచనలిస్తారు. ►వాహన రంగంపై ఆసక్తి ఉన్నవారికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన వాహనాలు అవసరముంటే అందులో దళితబంధు పథకం నిధులతో కొనుగోలు చేసిన వాహనాలనే తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ►సూపర్ మార్కెట్ పెట్టుకుందామనుకునే 10 మందిని ఒక గ్రూపుగా కలుపుతారు. వారి నిధులను కలిపి రూ.కోటితో మోర్ లేదా డీమార్ట్లతో ఒప్పందం చేయిస్తారు. ఆయా సూపర్మార్కెట్ల ఫ్రాంచైజీలు ఇప్పిస్తారు. వీటి నిర్వహణలో శిక్షణ కూడా ఇప్పిస్తారు. ►ప్రొక్లెయినర్లు, లారీలు వంటి భారీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో అవకాశమిస్తారు. ►వ్యవసాయం, ఎలక్ట్రానిక్, పారిశ్రామిక, మెడికల్, హార్డ్‌వేర్, సిమెంట్ ఇటుకలు, రెడిమిక్స్ తదితర సంబంధిత వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత ఆయా శాఖలు తీసుకుంటాయి. ►ప్రతీ వ్యాపారం/ యూనిట్‌పై ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ జరుపుతారు. నష్టాలు, లాభాల ఆధారంగా నిపుణులతో సలహాలు సూచనలిస్తుంటారు. ►ఒకవేళ లబ్ధిదారుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా.. వ్యాపారం/యూనిట్ నష్టపోకుండా వారికి దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నారు. -
భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
‘అవుట్ సోర్సింగ్’కు వెయిటేజీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీతోపాటు ప్రత్యేక వయోపరిమితి సడలింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం చాలా శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నా ఆయా పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నియామకాలతో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డునపడే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో అలాంటి వారిని రోడ్డున పడేయకుండా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వ కొలువుల భర్తీపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు 10 శాతం కోటా అమలు చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం ప్రత్యేక వెయిటేజీతో ప్రయోజనం కల్పించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారి సంఖ్య చాలా తక్కువే... రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 66,239 మంది కాంట్రాక్టు, 58,128 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో కొందరు మంజూరైన పోస్టుల్లో పనిచేస్తుండగా (అగైనెస్ట్ శాంక్షన్డ్ పోస్ట్స్), మరికొందరు మం జూరైన పోస్టులతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. మంజూరైన పోస్టులకు బదులుగా పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంజూరైన పోస్టులు సైతం ఉన్నత కేడర్లకు సంబంధించినవి ఉండగా వాటి స్థానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్ల వంటి కిందిస్థాయి ఉద్యోగులను కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులను భర్తీ చేసినా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి నామమాత్ర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్న నేపథ్యంలో వారి ఉద్యోగాలకు వచ్చిన నష్టం లే దని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కు తెలిపారు. ఇక ఆధార్ తప్పనిసరి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒకే పేరుతో వేర్వేరు జిల్లాల్లో నాలుగైదు చోట్ల జీతాలు పొందుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. దీంతో అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలకు తెరదించేందుకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులను వారి ఆధార్ కార్డులతో అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. -
కృత్రిమంగా కురిపిద్దాం..
- కృత్రిమ వర్షాల గురించి యోచిస్తున్న ప్రభుత్వం - రుతుపవనాల రాక ఆలస్యమయితే ప్రయోగించేందుకు ప్రణాళిక - మరాఠ్వాడా వద్ద ఉన్న - అమరావతి కేంద్రంగా ప్రయోగం - 1993, 2003లో చేపట్టిన - గత ప్రభుత్వాలు సాక్షి, ముంబై: ఎండలు మండిపోతుండటంతోపాటు వర్షకాలంలో వస్తున్న మార్పుల కారణంగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ వర్షాల వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలజీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం, పునరావాస విభాగం అధికారులతో కూడిన ఓ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి త్వరలో కృత్రిమ వర్షాలకు సంబంధించిన పనులు ప్రారంభించనుంది. కరవు ప్రాంతాలైన మరాఠ్వాడా, విదర్భ మధ్య భాగం అమరావతిని కేంద్రంగా ఇందుకు ఎన్నుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై నాలుగైదు సమావేశాలను కూడా నిర్వహించినట్టు మంత్రి ఏక్నాథ్ ఖడ్సే స్పష్టం చేశారు. 1993, 2003లో కృత్రిమ వర్షాల కోసం గత ప్రభుత్వాలు ప్రయోగాలు చేశాయి. అయితే అప్పుడు ప్రయోగాలను ఆలస్యంగా చేశారని, ఈ సారి జూన్ 15లోపు కృత్రిమ వర్షాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు సమితి అధికారి సుహాస్ దివసే తెలిపారు. రుతుపవనాలు రాక ఆలస్యం అవుతుందని తెలిస్తే వెంటనే కృత్రిమ వర్షాలను కురిపించనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాల వైపు ముంబై చూపు ప్రస్తుతం ముంబైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అప్పర్ వైతర్ణ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. ఇతర జలాశయాల్లో కూడా రెండు నెలలకు సరిపడా నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో నీటి మట్టం కూడా చాలా వేగంగా తగ్గిపోతోంది. దీంతో అధికారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యామ్నాయ మార్గాలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దృష్టి సారించినట్టు సమాచారం. నగరంలో ప్రతిరోజు దాదాపు 3,750 ఎమ్మెల్డీల నీరు సరఫరా అవుతోంది. ఈ లెక్కన ఏడాది పొడవునా సరఫరా సక్రమంగా జరగాలంటే కనీసం 14 లక్షల ఎమ్మెల్డీల నీటి నిల్వలు అవసరమవుతాయి. నీటి దొంగతనం, లీకేజీ, ఇతర కారణాల వల్ల సుమారు 700 ఎమ్మెల్డీల నీరు రోజూ వృథాగా పోతోంది. దీంతో వర్షాలు సమయానికి రాకపోతే కృత్రిమ వర్షాల ప్రయోగం మరోసారి చేయాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే కృత్రిమ వర్షాల ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత నిపుణులతో చర్చలు కూడా ప్రారంభించింది. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల పరిధిలో కృత్రిమ వర్షం ప్రయోగం చేశారు. కాని అది ఊహించిన విధంగా సఫలీకృతం కాలేకపోయింది. ఇందుకోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ ఫెయిల్ అవడం వంటివి జరిగాయి. ఆ తరువాత ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నీటి కొరత సమస్య కొంత మేర తీరింది. గత మూడు నాలుగేళ్ల నుంచి సగటు వర్షపాతం నమోదు అవుతుండటంతో కృత్రిమ వర్షాల ప్రయోగం చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. ఈ సారి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది జూన్ మొదటి వారంలోపు స్పష్టం కానుంది.