సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినబోతున్న దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. 16న (నేడు) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి సభ ద్వారా ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పథకం అమలులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా నూటికి నూరుపాళ్లు విజయవంతం చేయాలన్న సంకల్పంతో అధికారులు విధివిధానాలు, అమలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ముసాయిదా నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక రూపకల్పనలో మంత్రులు, ఐఏఎస్‌లు, దళిత మేధావులు, రాజకీయ నాయకులను కూడా భాగస్వాములను చేశారు. (చదవండి: దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్)
ఈ పథకం కింద దాదాపు 30 వరకు వివిధ స్వయం ఉపాధి, వ్యాపార యూనిట్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ పథకం రూపొందించామని అధికారులు తెలిపారు. వారు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా నైపుణ్య కల్పన, మార్కెటింగ్ సదుపాయం, శిక్షణ, ఆర్థిక క్రమశిక్షణపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారు. దీనికోసం పలు ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ముందుగానే ఒప్పందం చేసుకోవడం గమనార్హం. వారి వ్యాపారంలో ఇబ్బందులు, సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యత రెండేళ్ల వరకు తీసుకుంటారు.
అంతా సమగ్ర సర్వే ఆధారంగానే..
2014లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు తదితరాలపై పెద్ద డేటాబేస్‌నే ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న ప్రతీ పథకానికి ఇదే మూలం.
►లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక.. వారికి ఏ వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్ లేదా వాహన రంగాల్లో పూర్వానుభవం ఉందా? లాంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ మేరకు వారికి వ్యాపారం/ యూనిట్/ వాహనాలను కేటాయిస్తారు. పూర్వానుభవం లేనివారికి ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు.
ఉదా: పాడి గేదెలతో మినీ డైయిరీ యూనిట్‌కు కొందరు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి కేటాయించిన రూ.10 లక్షలు ఒకేసారి ఖర్చు చేయించరు. అవసరం మేరకు నిధులు ఖర్చు చేయించి యూనిట్ పెట్టిస్తారు. విజయ డెయిరీ సిబ్బందితో శిక్షణ ఇప్పిస్తారు. పాలను విజయ డెయిరీ వారే కొనేలా మార్కెటింగ్ కల్పిస్తారు. అలాగే ప్రతీనెలా వారికి డెయిరీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడేలా చూస్తారు. అందులోనూ పొదుపు, నిర్వహణ పోను.. ఖర్చులకు వాడుకునేలా లబ్ధిదారులకు అధికారులు సూచనలిస్తారు.
►వాహన రంగంపై ఆసక్తి ఉన్నవారికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన వాహనాలు అవసరముంటే అందులో దళితబంధు పథకం నిధులతో కొనుగోలు చేసిన వాహనాలనే తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
►సూపర్ మార్కెట్ పెట్టుకుందామనుకునే 10 మందిని ఒక గ్రూపుగా కలుపుతారు. వారి నిధులను కలిపి రూ.కోటితో మోర్ లేదా డీమార్ట్‌లతో ఒప్పందం చేయిస్తారు. ఆయా సూపర్‌మార్కెట్ల ఫ్రాంచైజీలు ఇప్పిస్తారు. వీటి నిర్వహణలో శిక్షణ కూడా ఇప్పిస్తారు.
►ప్రొక్లెయినర్లు, లారీలు వంటి భారీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో అవకాశమిస్తారు.
►వ్యవసాయం, ఎలక్ట్రానిక్, పారిశ్రామిక, మెడికల్, హార్డ్‌వేర్, సిమెంట్ ఇటుకలు, రెడిమిక్స్ తదితర సంబంధిత వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత ఆయా శాఖలు తీసుకుంటాయి.
►ప్రతీ వ్యాపారం/ యూనిట్‌పై ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ జరుపుతారు. నష్టాలు, లాభాల ఆధారంగా నిపుణులతో సలహాలు సూచనలిస్తుంటారు.
►ఒకవేళ లబ్ధిదారుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా.. వ్యాపారం/యూనిట్ నష్టపోకుండా వారికి దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment