Huzurabad Constituency
-
కేసీఆర్‌పై పోటీ చేస్తా!
హుజూరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు.. అక్కడ కూడా పోటీ చేస్తానని (పరోక్షంగా సీఎం కేసీఆర్‌పై) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనను హుజూరాబాద్‌లో గెలిపించేందుకు కథానాయకులుగా మారి బీజేపీ శ్రేణులు పనిచేయాలని కోరారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఆరు ఫీట్ల హైట్ లేకపోవచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చుగానీ ప్రజల బాధలు తీర్చేవాడిని..’అని ఈటల అన్నారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడుచేసిన దుర్మార్గపు పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి అని ఆరోపించారు. ‘హుజూరాబాద్‌లో హోదా ఉన్నవాడితో కొట్లాడతాంగానీ సైకోతో ఏం కొట్లాడుతాం.. పొలిటికల్ లీడర్ పొలిటికల్‌గా కొట్లాడాలి..’అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుందని, మొన్నటితో వారి పీడ విరగడైందని పేర్కొన్నారు. ‘కొట్టడం చేతకాక కాదు.. కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగాను. కొట్లాట నా సంస్కృతి కాదు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ ను. గూండాను కాదు. రౌడీని కాదు’అని అన్నారు. కొంతమంది చిల్లరగాళ్లు తను కేసీఆర్ కోవర్టు అని ఇంకా మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. కేసీఆర్ వల్ల నరకం అంటే ఏమిటో సంపూర్ణంగా అనుభవించిన వాడినని తెలిపారు. తన శక్తిని మొత్తం బీఆర్ఎస్ ఓటమికి వినియోగిస్తానన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా బెదిరిస్తే చమడాలు తీస్తాం.. జాగ్రత్త.. అని చెప్పాలంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అధికారులు పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన వాళ్ల మీద చెయ్యి పడినా అంతు చూసేవరకూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాదన్నారు. ఈనెల 16న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుజూరాబాద్‌కు రాబోతున్నారని, సభను గొప్పగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పొలిటికల్ ప్లాన్ రివర్స్!
గులాబీ బాస్‌కు కొరుకుడు పడని సీటుగా హుజూరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించి కమలం గుర్తు మీద మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటలకు సరిజోడు అనుకున్న కౌశిక్‌రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్‌ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళితబంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ ఓటమితో.. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్చార్జ్గా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్‌రెడ్డిని ఆదేశించారు. అయితే, కౌశిక్‌రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే.. ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరం అవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువును తీస్తున్నారని కేసీఆర్‌కు నివేదికలందాయి. తెరపైకి ప్రశాంత్ రెడ్డి.. కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి, పదవి ఇచ్చి, ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్‌కు ఆలోచన మొదలైంది. కౌశిక్‌రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖాన్ని తీసుకువచ్చి హుజూరాబాద్‌లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా.. కౌశిక్‌రెడ్డి, ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్‌ను కాదని.. ఓ పోలీస్ ఆఫీసర్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్పీగా ఉన్న పింగళి ప్రశాంత్‌రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే, అంతకుముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్‌లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట. ఈటలకు దూరపు బంధువు.. హుజూరాబాద్‌లో ఈటలకు ధీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కుల, మతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి.. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అమలుచేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండటంతో.. ప్రశాంత్‌పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈటలకు దూరపు బంధువు కూడా అయిన ప్రశాంత్‌నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. తన ప్రమేయమేమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదీ తనను ఓ పొలిటీషియన్‌గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా..? లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డా.. సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ఇది కూడా చదవండి: బీజేపీ ‘పరివార’ చర్చలు -
మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్
హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి సంచలనాలకు వేదికగా మారబోతోంది. అదీ గులాబీ పార్టీలోనే పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ సీటును గులాబీ పార్టీలో ముగ్గురు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈటల మారారు, సీన్ మారింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో గులాబీ కోట బీటలు వారింది. టీఆర్ఎస్లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీ కేడర్‌లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు నేతలు హుజూరాబాద్ టికెట్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభ వద్దు.. శాసనసభ ముద్దు..! 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వచ్చినా.. తానే టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండబోతున్నట్టు ఆడియోలు బయటకు వచ్చినా.. మారిన సమీకరణాలు వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు. కానీ టిక్కెట్ దక్కలేదు. గులాబీ దళపతి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్‌రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ముచ్చటగా ముగ్గురి పోటీ మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తానేం తగ్గేదెలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది తానే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది. అప్పుడు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్‌బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొత్త వారు కూడా ఈ సెగ్మెంట్‌ను కోరుకునే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన్ను తట్టుకుని నిలబడే వారు అక్కడ గానీ చుట్టుపక్కల గానీ గులాబీ పార్టీలో కనిపించరనే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు పోటీ పడే పరిస్తితి వస్తే అది ఈటలకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్‌ను కేసీఆర్ ఎవరికి ఇస్తారో చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ప్రారంభం పదుల్లోనే...!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు ఉపాధి యూనిట్ల ప్రారంభం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేసింది. దళిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడాలనే లక్ష్యంతో యు ద్ధప్రాతిపదికన అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు హుజూరాబాద్‌లో 20వేల దళిత కుటుంబాలకు సాయం అందించేలా నిర్ణయించగా, ఇప్పటివరకు 18,064 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి దళిత రక్షణ నిధి కింద రూ.10వేల చొప్పున వెనక్కు తీసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షలు నిల్వ ఉన్నాయి. లబ్ధిదారు ఏర్పాటుచేసే యూనిట్‌కు కలెక్టర్ అనుమతితో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో ఇప్పటివరకు యాభైలోపు యూనిట్లు మాత్రమే ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపికలో జాప్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక లబ్ధి కలిగే కేటగిరీలో దళితబంధు రెండోది. ఓవర్సీ స్ విద్యానిధి పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండగా... దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. అయితే దళితబంధు లబ్ధిదారుల సంఖ్య విద్యానిధి లబ్ధిదారుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దళితబంధు లబ్ధిదారుడు ఆర్థిక వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక ఉపాధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ 120 రకాల ఆలోచనలతో లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. అయినా చాలామంది ఇప్పటికీ ఉపాధి యూనిట్‌ను ఖరారు చేసుకోలేదు. కేవలం 6 వేల మంది మాత్రమే కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సైతం అధికారులకు ఇవ్వలేదు. ఆయా యూనిట్లు, వాటి నిర్వహణ తదితరాలపై స్పష్టత ఉన్నప్పుడే కలెక్టర్ ఆమోదంతో ఖాతాలోని నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో... హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు రావడంతో దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ అమలైంది. అందువల్ల దళితబంధు యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో నెలాఖరులోగా యూనిట్లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అంటున్నాయి. అయితే, మెజార్టీ లబ్ధిదారులు ఇంకా యూనిట్లను ఎంపిక చేసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రౌండింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. -
హుజూరాబాద్‌కు సంజయ్ చేసిందేంటి?
హుజూరాబాద్: ఎంపీగా హుజూరాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేమీ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్తామని.. ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే బీజేపీ చేసిన అభివృద్ధా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసిందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళిత బంధుపై బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
దళితబంధును అడ్డుకున్నాయి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ–టీఆర్ఎస్లు కలిసే దళితబంధును అడ్డుకున్నాయని, తాను గాడ్సే కాదని అసలైన గాడ్సే అమిత్‌షానే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం బీజేపీ–టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ చేసి, ఇక్కడ కుస్తీలు పట్టేవారని, ఇప్పుడు మాత్రం రెండు చోట్లా కలిసిపోయారని ఆరోపించారు. పెట్రోలు, గ్యాస్, వంటనూనె ధర లు పెరుగుతున్నా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నిం చడం లేదని టీఆర్ఎస్ను నిలదీశారు. భూపంచాయతీల్లో విభేదాలు రావడం వల్లే రాజేందర్ రాజీనామా, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. 20 ఏళ్లు స్నేహితుడిగా ఉన్న రాజేందర్ ఇప్పుడు దొంగ ఎలా అయ్యారని మంత్రి హరీశ్‌ను ప్రశ్నిం చారు. కరీంనగర్ జిల్లాకు హుజూరాబాద్‌కు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఎస్సారెస్పీ కాలువలు, ఇం దిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాడిన బల్మూరి వెంకట్ సరైన అభ్యర్థి అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని 30న హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. రాజేందర్‌ను బీజేపీలోకి పంపింది కేసీఆరే.. వీణవంకలో జరిగిన సభలో రేవంత్ మాట్లాడుతూ‘గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్ రహస్యంగా భేటీ అయ్యారని ఓ సన్నాసి అంటుండు. మేం కలుసుకుంది మే 7న. వేం నరేందర్‌రెడ్డి కొడుకు లగ్గం కోటు సందర్భంగా చాలా మంది వచ్చిండ్రు. అక్కడ ఈటలను కలుసుకున్నది వాస్తవమే’అని అన్నారు. రాజేందర్‌ను బీజేపీలోకి పంపించిందే కేసీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. సభకు హాజరైన జనం. (ఇన్సెట్లో) మాట్లాడుతున్న రేవంత్. చిత్రంలో బల్మూరి -
ఆపింది.. మీరంటే మీరే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం నిలిపివేత రాజకీయ రగడకు దారితీసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసే వరకు ఆ పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీల నేతలు, దళితులు ఆందోళనలకు దిగారు. పథకం నిలిచిపోవడానికి కారణం ‘మీరంటే.. మీరు’అంటూ పోటాపోటీ నిరసనలకు దిగారు. సోమవారంరాత్రి సీఈసీ నుంచి ప్రకటన వెలువడగానే హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇటు గులాబీ శ్రేణులు, అటు కాషాయదళాలు పరస్పరం సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్–బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ►జమ్మికుంటలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ►జమ్మికుంట అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆధ్వర్యంలో ఈటలదహనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ►జమ్మికుంట మండలం కోరపల్లిలోనూ బీజేపీ–టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనాలకు యత్నించడంతో తోపులాట జరిగింది. ►వీణవంక మండలం వలబాపూర్ రహదారిపై ఈటలకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్ వద్ద మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. జమ్మికుంటలో పోలీసులు, బీజేపీ నేతల వాగ్వాదం -
మోదీ, కేసీఆర్ పాలనకు బుద్ధి చెప్పండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీమంత్రి పొన్నాల లక్ష్మ య్య పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలోని రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి లోపాయికారీగా కేసీఆర్ మద్దతునిస్తున్నారని, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పొన్నాల కోరారు. -
Huzurabad Bypoll: గెల్లుతో బల్మూరి ఢీ!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగరావు పేరు ఖరారయినట్టేనని తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు వెళ్లాయని, ఏఐసీసీ ఆమోదంతో నేడో, రేపో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు కూడా పంపినప్పటికీ విద్యార్థి సంఘం నాయకుడు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ పేరే అధికారికంగా ఖరారవుతుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. సీఎల్పీ సై .. పీసీసీ ఓకే టీఆర్ఎస్ తరఫున టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దించిన నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు పరిశీలనకు వచ్చింది. సీఎల్పీ నేత భట్టి ఈ ప్రతిపాదన చేయగా మాజీ మంత్రులు, కరీంనగర్ జిల్లా నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్ బాబులు సంపూర్ణంగా మద్దతిచ్చారు. ఇందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ మరోసారి సమావేశమై వెంకట్ పేరును ఖరారు చేసి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది. వెంకట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన స్వగ్రా మం ఉంది. 2018 ముందస్తు ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ విద్యార్థి సంఘాన్ని వెంకట్ పరుగులు పెట్టించారు. అనేక విద్యార్థి సంబంధిత అంశాలపై ఎన్ఎస్యూఐని క్రియాశీలకంగా నడిపించడంతో పాటు మంత్రి మల్లారెడ్డి అవినీతి విషయంలో ఆందోళనలు చేసి కేసుల పాలయ్యారు. కరోనా తదనంతర విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమ స్యలను తీసుకెళ్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగ ణనలోకి తీసుకుని వెంకట్‌ను బరిలో దింపుతు న్నామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. పార్టీ అభిమతమే ఫైనల్: వెంకట్ హుజూరాబాద్‌లో పోటీ విషయమై పార్టీ తనను అడిగిందని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకట్ వెల్లడించారు. పార్టీ అభిమతమే ఫైనల్ అని చెప్పానని తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. టీఆర్ఎస్ నుంచి విద్యార్థి సంఘం నేత బరిలోకి దిగిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఈ ఎన్నికల వేదికగా ప్రజలకు వివరిస్తామని వెంకట్ వ్యాఖ్యానించారు. -
Huzurabad: కంచుకోటలో చావో రేవో
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలల వ్యవధిలోనే రూపు మార్చుకున్న హుజూరాబాద్ రాజకీయం తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మరింత వేడెక్కనుంది. పార్టీ పుట్టుక నుంచి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో ప్రస్తుత ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలో చేరి సవాలు విసురుతున్నారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్, ఇన్నాళ్లూ సాధిస్తూ వస్తున్న వరుస విజయాల పరంపరను కొనసాగించేందుకు ఈటల శ్రమిస్తుండటంతో ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో పార్టీని వీడిన ఈటల.. బీజేపీలో చేరి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కుట్రపూరితంగా బయటకు పంపిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. హుజూరాబాద్‌లో నామమాత్రంగా ఉన్న బీజేపీ.. ఈటల చేరిక నేపథ్యంలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఆరుసార్లు టీఆర్ఎస్.. నాలుగు పర్యాయాలు ఈటలే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2004లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, 2008లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఎన్నికయ్యారు. అయితే పొరుగునే ఉన్న కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి గెలిచిన ఈటల రాజేందర్ కూడా 2008 ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ అంతర్థానమై హుజూరాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగమైంది. కాగా 2009లో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల విజయం సాధించారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో కలుపుకుని మొత్తంగా నాలుగుసార్లు ఆ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల ఎన్నికయ్యారు. అప్పటి ఈటల ప్రత్యర్థులందరూ ఇప్పుడు టీఆర్ఎస్లో..! ఈటల కమలాపూర్ నుంచి రెండుసార్లు, హుజూరాబాద్ నుంచి నాలుగు సార్లు మొత్తంగా ఆరుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరు ఎన్నికల్లోనూ వివిధ పార్టీల తరఫున ఆయనతో పోటీ పడిన ప్రధాన ప్రత్యర్ధులందరూ టీఆర్ఎస్ నుంచి ఈటల నిష్క్రమణ తర్వాత గులాబీ పార్టీ గూటికి చేరుకోవడం గమనార్హం. కమలాపూర్‌లో టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్ధిగా (2014లో) ఉన్న దివంగత మాజీ మంత్రి కుమారుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్‌లో 2009 సాధారణ ఎన్నిక, 2010 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తర్వాతి కాలంలో అధికార పార్టీలో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా జూలైలో టీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ తండ్రి గెల్లు మల్లయ్య 2004 ఎన్నికలో కమలాపూర్ నుంచి ఈటల రాజేందర్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. ప్రలోభాలు వారివి.. పథకాలు మావి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధి కోసం జాబితాకు కూడా అందనన్ని కార్యక్రమాలు చేపట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నాం. బీజేపీ మాత్రం మోసపూరిత ప్రకటనలు, హామీలు ఇస్తూ కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లలు పంచుతూ రాజకీయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ మళ్లీ గెలిచినా నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదు. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఉనికే లేదు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదు. – తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ఆట ఆరంభం.. ఎవరూ తగ్గడం లేదు
సాక్షి, కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. షెడ్యూలు విడుదలతో జిల్లాలో అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ స్థానానికి రాజీనామా చేసిన దాదాపు నాలుగునెలల సుదీర్ఘ సమయం తరువాత షెడ్యూల్ రావడంతో నేతల నిరీక్షణకు తెరపడింది. ఇక అసలైన కదనరంగంలోకి కొదమసింహాల్లా దూకనున్నారు. వాస్తవానికి రాజేందర్ రాజీమానాతోనే జిల్లాలో ఉపఎన్నిక వాతావరణం మొదలైంది. రెండు ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాకంగా తీసుకోవడంతో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించ తలపెట్టిన ఈ ఎన్నిక నిర్వహణను అధికారులు సైతం సవాలుగా తీసుకున్నారు. కాగా.. హుజూరాబాద్ ఓటర్ల సంఖ్య 2.36,283గా అధికారులు తేల్చారు. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల మంది ఓటర్లు పెరగడం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని అధికారులు వివరించారు. విమర్శలు– ప్రతివిమర్శలు.. ► రాజేందర్ రాజీనామా అనంతరం హుజూ రాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఆలోచనతో కేసీఆర్ తన మాస్టర్‌ప్లాన్‌ను అనుకున్నట్లుగానే అమలు చేస్తున్నారు. ► దళితబంధు పథకం అమలుకు చకచకా రూ.2000 కోట్లు విడుదల చేశారు. లబ్ధి దారుల సర్వే కూడా అంతే వేగంగా పూర్తయింది. 10 మందికిపైగా లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగిపోయింది. ► మరోవైపు మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి రాజేందర్ విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది వ్యవహారం. ఒకదశలో వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ► టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్, హరీశ్‌రావులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో హరీశ్‌రావు కూడా దీటుగానే ప్రత్యారోపణలు చేస్తున్నారు. ► బీజేపీ విధానాలను, పెట్రో ధరల పెంపును, ప్రైవేటీకరణ, ప్రభుత్వాస్తుల విక్రయం తదితర విషయాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డబుల్ డోస్ లేకుంటే అంతే.. ► కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. రాజకీయ పార్టీల నేతలు–విధుల్లో పాల్గొనే అధికారులు సెకండ్ డోస్ సర్టిఫికేట్ లేకుండా అనుమతించరు. ► ఇప్పటికే హుజూరాబాద్ వ్యాప్తంగా దాదా పు 80శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా అధికారులు త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల రాజకీయ నేతలు, కార్యకర్తల్లో చాలామంది డబుల్ డోస్ వేసుకోలేదు. దీంతో రెండో డోస్ కోసం మధ్యాహ్నం నుంచి ఉరుకులు పరుగులు తీస్తున్నారు. 30న అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్? ► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి హుజూరాబాద్ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ► ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించింది. బీజేపీ నుంచి రాజేందర్ పోటీ చేస్తారు. ఇక ప్రధా న ప్రతిపక్షాల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ మాత్రం హుజూరాబాద్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోగా.. ఈనెల 30న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ నలుగురు పేర్లను తెరపైకి తీసుకొ చ్చింది. వీరిలో కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్యాట రమేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ► మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక దూకుడుగా వెళుతున్నా రు. ఆయన సభలకు హాజరవుతున్న ఉమ్మడి జిల్లా నేతలు తమ అనుచరులను తరలించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
రంగంలోకి ఇంటెలిజెన్స్ .. హుజూరాబాద్ ప్రజలకు ప్రశ్నలు?
సాక్షి, హైదరాబాద్: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో ఇంటెలిజెన్స్ విభాగం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఇంటెలిజెన్స్ విభాగం.. అధికారులు, సిబ్బందిని అక్కడ మోహరించింది. ఈటల టీఆర్ఎస్కు రాజీనామా తర్వాత నియోజకవర్గంలో పరిణామాలను అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించారు. సర్వేలు చేసి పార్టీల బలాలు, బలహీనతలను ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. హుజూరాబాద్ ఎన్నిక ఆగస్టులోనే వస్తుందని భావించి భారీస్థాయిలో సిబ్బందితో సర్వేలు రూపొందించారు. అప్పుడు బెంగాల్లో జరిగే ఉప ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో నిఘా విభాగం కొంత రిలాక్స్ అయ్యింది. 100 నుంచి 150 మంది... ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఇంటెలిజెన్స్‌లో ఉన్న పొలిటికల్ విభాగం ఉన్నతాధికారులు మూడు రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిని హుజూరాబాద్‌లో మోహరించారు. మొత్తంగా 100 నుంచి 150 మందిని నియోజకవర్గంలో నియమించినట్లు తెలిసింది. పార్టీల వారీగా అధికారులు, సిబ్బందిని విభజించి డ్యూటీలు వేశారని తెలిసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందించనున్నారు. పార్టీలు, కులాలు, వయసు... ఇంటెలిజెన్స్ బృందాలు సర్వేలో భాగంగా ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు సంబంధించి ప్రశ్నలు కూర్పు చేసినట్లు సమాచారం. అలాగే కులాలు, మతాలు, ఓటర్ల వయసు, వారి వృత్తి, పార్టీలపరంగా, మహిళల్లో కేటగిరీల వారీగా, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీ సర్వేలో 5 నుంచి 6 వేల మంది నుంచి వివరాలు సేకరించేలా నిఘా విభాగం భారీ కసరత్తు చేసింది. ఎన్నిక ముగిసే వరకు ప్రతీ నాలుగు రోజులకోసారి సర్వే పూర్తి చేసి నిఘా విభాగాధిపతికి అందజేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి ప్రశ్నలు.. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు, సీఎం పనితీరు, దళితబంధు, అభ్యర్థి ఎంపిక బీజేపీకి సంబంధించి ప్రశ్నలు.. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు, పెట్రో ధరలు, అభ్యర్థి వ్యవహారాలు, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి ప్రశ్నలు.. ప్రతిపక్షం పనితీరు, అభ్యర్థి పోటీ ఇవ్వగలడా, టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారంతోనే పోటీనివ్వనుందా -
అర్హులందరికీ దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం కరీంనగర్ జిల్లా లోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలందరికీ అమలు చేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. వివాహమైన ప్రతి దళిత కుటుంబానికీ పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దళితబంధు డబ్బులతో స్వయంఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచిం చారు. దళితబంధు ద్వారా వచ్చే రూ.10 లక్షలతో లబ్ధిదారులు 4 యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్లలోపు వయసు ఉన్న దళితులందరికీ పథకం అందుతుందని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో డబ్బులు అందని దళిత కుటుంబాలందరికీ మూడురోజులలోపు వారి ఖాతాలో జమ చేయాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. యూనిట్లు స్థాపించుకునే వరకు ఖాతాలో నిల్వఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 21న నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులకు వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇల్లందకుంట మండలానికి చెందిన కొత్తూరి జయ, ఆమె భర్త మొగిలి, హుజూరాబాద్ మండ లం కనుకులగిద్దెకి చెందిన కొత్తూరి రాధ, భర్త మొగిలి, కమలాపూర్ మండలం, శనిగరం గ్రామానికి చెందిన రాజేందర్‌ను కరీంనగర్ డెయిరీ పశువుల డాక్టర్ రహీం అక్తర్, మండల పంచాయతీ అధికారి రవి హరియాణాకు తీసుకెళ్లారని, రోహతక్ జిల్లాలో పాడి గేదెలు కొనుగోలు చేశారని కలెక్టర్ వెల్లడించారు. -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు మైలపోలు తీసుడు ఖాయం: ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్‌కు మైలపోలు తీసుడు ఖాయమని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కుమ్మర కులస్థుల శంఖారావం సందర్భంగా పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. ‘టీఆర్ఎస్ నాయకులు దళితవాడలకు వెళ్లి ఇంటికో రూ.10 లక్షలు ఇస్తం. గులాబీ కండువా కప్పుకోవాలని అంటున్నారు. నా రాజీనామా వల్లే హుజూరాబాద్‌కు ఇంత దశ వచ్చింది, ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు మళ్లీ ఇప్పుడు అందుతున్నాయి’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌కు అవసరం ఉంటేనే ప్రజలను పట్టించుకుంటారని, ఫాంహౌస్ నుంచి బయటికి వస్తున్నారని విమర్శించారు. ఓట్లు అవసరం ఉంది కాబట్టే కేసీఆర్ మొదటిసారి దళితులను పిలిపించుకొని బువ్వ పెట్టి పోయారన్నారు. జాతీయ ఖాదీ బోర్డు చైర్మన్ పేరాల శేఖర్జీ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశానికి దిక్సూచిగా మారనుందని, ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘దళితబంధు’ సర్వే చకచకా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను మొత్తం ఏడు యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ను ఐదు క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ‘దళితబంధు’యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో లబ్ధిదారుల పేరు, వయసు, ఫోన్, రేషన్‌కార్డు, ఆధార్ నంబర్లు, సమగ్ర కుటుంబసర్వే నంబరు, చిరునామా, కుటుంబసభ్యులు ఎందరు? వారి వయసు, ఆధార్, ఫోన్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రతివ్యక్తి ఫొటోను ట్యాబ్‌లో పొందుపర్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్, యాప్‌లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వే సమయంలోనే ఏ యూనిట్ అంటే ఆసక్తి ఉంది? అన్న వివరాలు కూడా తీసుకుంటున్నారు. 2014లో సమగ్ర కుటుంబసర్వేనే దళితబంధు సర్వేకు ప్రామాణికంగా తీసుకున్నారు. సమగ్ర కుటుంబసర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో 20,900 దళిత కుటుంబాలున్నాయి. సమగ్ర కుటుంబసర్వే తర్వాత మరో రెండు, మూడు వేల వరకు కొత్త కుటుంబాలు పెరిగాయి. ఆ కొత్త కుటుంబాల కోసం ఖాళీ దరఖాస్తులు (లబ్ధిదారుల సమాచార పత్రం) ఇచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. అందరి వివరాలు ఏ రోజుకారోజు కరీంనగర్ కలెక్టరేట్లో పొందుపరుస్తున్నారు. సీఎంసభకు ముందురోజు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టరేట్, ఇతర ప్రభుత్వవిభాగాల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతూ ఇంటింటి సర్వే పనులు చేస్తుండటం గమనార్హం. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Huzurabad Bypoll: ‘రాజేందరన్న నువ్వు బాధపడకు.. గెలిచేది మనమే’ -
Dalit Bandhu: రాధమ్మ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా..
రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం. రూ. 1.75 లక్షల కోట్లు.. నాయకుడికి చేసే పనిమీద వాక్శుద్ధి, చిత్తశుద్ధి, అవగాహన ఉంటే పనులు అవే సాగుతాయి. దళితబంధు పథకాన్ని ముమ్మాటికీ 100 శాతం విజయవంతం చేసి తీరుతాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరందరి కోసం రూ.1.75 లక్షల కోట్లను మూడు, నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం. అయితే నిరుపేదలకు ముందు ఇస్తాం, తర్వాత మిగతా కుటుంబాలకు ఇస్తాం. ఇప్పటికీ పేదరికంలోనే.. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ‘దళితబంధు’పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. దళితవాడలు బంగారు మేడలవ్వాలి.. దళిత జాతి రత్నాలను, దళిత శక్తిని బయటికి తీయాలన్నది మా సంకల్పం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పేదరికం, ఆకలి, వివక్ష, అవమానాలతో వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై అంబేడ్కర్, జగ్జీవన్రామ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. చివరిలో జైభీమ్, జై దళితబంధు అంటూ ముగించా రు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. ‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘దళితబంధు’పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎనిమిదేళ్ల నాటి సర్వే కావడంతో ఇప్పుడు అదనంగా రెండుమూడు వేల మంది లబ్ధిదారులు పెరిగినా నష్టమేమీ లేదు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం. ఈ పథకాన్ని ప్రకటించాక కొందరు చిల్లరమల్లర విమర్శలు చేశారు. నేను స్పందించలేదు. స్పందించి మొత్తం వివరాలు చెప్పి ఉంటే.. ఆనాడే ఆ నాయకుల గుండెలు ఆగి మరణించేవారు. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దు. సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, దళితబంధు లబ్ధిదారులు 25 ఏళ్లనాటి ఆలోచన.. ఈ పథకం ద్వారా దళిత వాడలను బంగారు మేడలు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు. 25ఏళ్ల క్రితం నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట వారి అభ్యున్నతికి పాటుపడ్డాం. గత ఏడాదే ఈ పథకం ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. దళితబంధు పథకం నిధులతో మీకు నచ్చిన, వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, హార్వెస్టర్లు, బార్లు, వైన్‌షాపులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు ఏది చేసినా.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు మార్కెటింగ్ కల్పిస్తాయి. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తాం. పొరపాటున లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా దళిత రక్షణనిధి నుంచి సాయం అందిస్తాం. కొత్తగా ‘దళిత బంధు’ఖాతాలు దళితబంధు పథకం కింద ఇచ్చే సొమ్ముకు బ్యాంకుల నుంచి కిస్తీల బాధ ఉండదు. మీ డబ్బుకు మీరే యజమానులు. బ్యాంకు వారు పాత బకాయిలు కట్ చేసుకోకుండా కొత్తగా దళితబంధు పేరుతో ఖాతాలు తెరిపించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారు. దళితబంధు పథకం కాదు.. ఇదొక మహా ఉద్యమం. దేశమంతా ఈ ఉద్యమం పాకాలి. అందుకు హుజూరాబాద్ పునాది రాయి కావాలి. పథకం అమలుకోసమే కర్ణన్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించాం. దళిత జాతి అభ్యున్నతికి, ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కుమారుడు ఐఏఎస్ అ«ధికారి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించాం. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో దళితబంధు ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రజలు విద్యార్థులు గ్రామాలకు వెళ్లాలి దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా దళిత మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతీ గ్రామానికి వెళ్లి ‘గో టు విలేజేస్ అండ్ ఎడ్యుకేటెడ్ అవర్ మాసెస్’అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా, యాదవులకు రూ.11 వేల కోట్లకుపైగా కేటాయించాం. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు..’’ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా.. సభలో ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తొలి చెక్కును రాధమ్మ అనే మహిళకు ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావని కేసీఆర్ ఆమెను అడగ్గా.. తనకు డెయిరీ అంటే ఆసక్తి ఉందని రాధమ్మ చెప్పింది. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అయితే.. మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాయ్ తాగుతా’ అని పేర్కొన్నారు. జంబో వేదిక.. శాలపల్లి సభలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. కీలక మంత్రులు, ఎమ్మెల్యేలంతా వేదికపై ఆసీనులు కావడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కె.కేశవరావు, లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, దానం నాగేందర్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, రేఖానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తాజా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. గోప్యంగా లబ్ధిదారుల తరలింపు – చివరి నిమిషం దాకా బయటపెట్టని వైనం – వేదిక వెనుక నుంచి తీసుకువచ్చిన అధికారులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘దళితబంధు’ పథకాన్ని అందుకునే లబ్ధిదారుల పేర్లను అధికారులు చివరివరకు గోప్యంగా ఉంచారు. వారికి ఆదివారం రాత్రే సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయమే వెళ్లి లబ్ధిదారులను, వారి కుటంబసభ్యులను ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకువచ్చారు. సభ వద్ద కూడా వారు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. వెనుకవైపు వీఐపీ మార్గం ద్వారా వేదికపైకి పంపించారు. సభ వద్ద ఆయా లబ్ధిదారులు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడారు. డెయిరీ పెట్టుకుంటా.. మేం కూలి పనిచేసుకొని బతుకున్నాం. ఈ 10 లక్షలతో పాడి పశువులు కొని డెయిరీ పెట్టాలనుకుంటున్నాం. సాయం రావడం కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్.. మా బతుకుల్లో వెలుగులు నింపిండు. -కొత్తూరిరాధ–మొగిలి, కనుకులగిద్ద, హుజూరాబాద్, తొలి లబ్ధిదారు ట్రాక్టర్ తీసుకుంటం అధికారులు వచ్చేంత వరకూ నా పేరు ఎంపికయిందని తెలియదు. ఆర్థిక సాయంతో ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. నా కుమారుడికి ట్రాక్టర్ అప్పజెబుతా. మాకున్న ఎకరం భూమికి మరింత భూమి కౌలు తీసుకుని, దున్నుకోవాలని ఆలోచిస్తున్నం. -రవీందర్, కన్నూరు, కమలాపూర్ భూమి కొనుక్కుంటా.. మాకు భూమి లేదు. మేమిద్దరం కూలీలమే. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో 20 గుంటల భూమి కొనుక్కుంటాం. సీఎం చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరువలేం. మాకు వస్తదనుకోలే.. - రాధిక, శనిగరం, కమలాపూర్ మండలం అధికారులు సూచించినట్టు చేస్తా.. నేను దినసరి కూలీని. దళిత బంధు సాయానికి ఎంపికైనట్టు ఉదయం దాకా తెలియదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారులు ఎట్ల చెప్తే అట్ల చేసుకుంటా. -బాజాల సంధ్య, హుజూరాబాద్ మండలం సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నది వీరే.. 1. కొత్తూరి రాధ–మొగిలి, హుజూరాబాద్ రూరల్ 2. రొంటల రజిత– సరిత, హుజూరాబాద్ అర్బన్ 3. కొత్తూరి స్రవంతి – కనకం 4. శనిగరపు సరోజన – రవీందర్ 5. చెరువు ఎల్లమ్మ – రాజయ్య, జమ్మికుంట మండలం నగరం గ్రామం 6. రాచపల్లి శంకర్– మౌనిక, జమ్మికుంట టౌన్ 7. పిల్లి సుగుణ– మొగిలి, జమ్మికుంట రూరల్ 8. సంధ్య బాజాల– గంగయ్య 9. కడెం రాజు– వినోద, ఇల్లందకుంట 10. కసరపు స్వరూప– రాజయ్య, వీణవంక 11. ఎలుకుపల్లి కొమురమ్మ– రాజయ్య, చల్లూరు 12. కనకం రవీందర్– హరిత, కమలాపూర్ 13. నామపెల్లి రాజేందర్ 14. మాట్ల సుభాష్– మనెమ్మ 15. రాజేందర్, కమలాపూర్ -
పైసల్ ఇవ్వడమే కాదు.. తోడూనీడలా దళితబంధు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినబోతున్న దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. 16న (నేడు) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి సభ ద్వారా ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పథకం అమలులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా నూటికి నూరుపాళ్లు విజయవంతం చేయాలన్న సంకల్పంతో అధికారులు విధివిధానాలు, అమలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ముసాయిదా నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక రూపకల్పనలో మంత్రులు, ఐఏఎస్‌లు, దళిత మేధావులు, రాజకీయ నాయకులను కూడా భాగస్వాములను చేశారు. (చదవండి: దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్) ఈ పథకం కింద దాదాపు 30 వరకు వివిధ స్వయం ఉపాధి, వ్యాపార యూనిట్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ పథకం రూపొందించామని అధికారులు తెలిపారు. వారు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా నైపుణ్య కల్పన, మార్కెటింగ్ సదుపాయం, శిక్షణ, ఆర్థిక క్రమశిక్షణపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారు. దీనికోసం పలు ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ముందుగానే ఒప్పందం చేసుకోవడం గమనార్హం. వారి వ్యాపారంలో ఇబ్బందులు, సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యత రెండేళ్ల వరకు తీసుకుంటారు. అంతా సమగ్ర సర్వే ఆధారంగానే.. 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు తదితరాలపై పెద్ద డేటాబేస్‌నే ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న ప్రతీ పథకానికి ఇదే మూలం. ►లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక.. వారికి ఏ వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్ లేదా వాహన రంగాల్లో పూర్వానుభవం ఉందా? లాంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ మేరకు వారికి వ్యాపారం/ యూనిట్/ వాహనాలను కేటాయిస్తారు. పూర్వానుభవం లేనివారికి ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. ఉదా: పాడి గేదెలతో మినీ డైయిరీ యూనిట్‌కు కొందరు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి కేటాయించిన రూ.10 లక్షలు ఒకేసారి ఖర్చు చేయించరు. అవసరం మేరకు నిధులు ఖర్చు చేయించి యూనిట్ పెట్టిస్తారు. విజయ డెయిరీ సిబ్బందితో శిక్షణ ఇప్పిస్తారు. పాలను విజయ డెయిరీ వారే కొనేలా మార్కెటింగ్ కల్పిస్తారు. అలాగే ప్రతీనెలా వారికి డెయిరీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడేలా చూస్తారు. అందులోనూ పొదుపు, నిర్వహణ పోను.. ఖర్చులకు వాడుకునేలా లబ్ధిదారులకు అధికారులు సూచనలిస్తారు. ►వాహన రంగంపై ఆసక్తి ఉన్నవారికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన వాహనాలు అవసరముంటే అందులో దళితబంధు పథకం నిధులతో కొనుగోలు చేసిన వాహనాలనే తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ►సూపర్ మార్కెట్ పెట్టుకుందామనుకునే 10 మందిని ఒక గ్రూపుగా కలుపుతారు. వారి నిధులను కలిపి రూ.కోటితో మోర్ లేదా డీమార్ట్లతో ఒప్పందం చేయిస్తారు. ఆయా సూపర్మార్కెట్ల ఫ్రాంచైజీలు ఇప్పిస్తారు. వీటి నిర్వహణలో శిక్షణ కూడా ఇప్పిస్తారు. ►ప్రొక్లెయినర్లు, లారీలు వంటి భారీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో అవకాశమిస్తారు. ►వ్యవసాయం, ఎలక్ట్రానిక్, పారిశ్రామిక, మెడికల్, హార్డ్‌వేర్, సిమెంట్ ఇటుకలు, రెడిమిక్స్ తదితర సంబంధిత వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత ఆయా శాఖలు తీసుకుంటాయి. ►ప్రతీ వ్యాపారం/ యూనిట్‌పై ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ జరుపుతారు. నష్టాలు, లాభాల ఆధారంగా నిపుణులతో సలహాలు సూచనలిస్తుంటారు. ►ఒకవేళ లబ్ధిదారుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా.. వ్యాపారం/యూనిట్ నష్టపోకుండా వారికి దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నారు. -
దళితబంధు జాబితాలో అనర్హులా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని పలువురు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు శుక్రవారం అధికారులు సర్వే చేపట్టారు. ఆ సమయంలో జాబితాలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణవంకలో పేదలకు కాకుండా అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని ఆరోపిస్తూ పలువురు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారిని, స్థానికంగా లేని వారిని ఎలా ఎంపిక చేస్తారని తహసీల్దార్ సరిత దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 250 దళిత కుటుంబాలు ఉంటే.. కేవలం ఏడుగురిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే ప్రగతి భవన్‌కు తమ గ్రామం నుంచి నలుగురు వెళ్తే.. ఇద్దరిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. జమ్మికుంటలో కూడా పలువురు దళితులు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల జోక్యంతో వారంతా ఆందోళన విరమించారు. ఇంకా ఎవరికీ మంజూరు చేయలేదు: కలెక్టర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తయిందని. అయితే ఇంతవరకూ ఎవరికీ మంజూరు చేయలేదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని.. అనంతరం ప్రతి ఒక్కరికీ ఈ పథకం మంజూరుచేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు. సమాచార లోపం వల్లే.. దీనిపై కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను ‘సాక్షి’ సంప్రదించింది. లబ్ధిదారుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగదని వారు స్పష్టంచేశారు. 2015లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆ సర్వే సమయంలో కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకునేందుకు 24 గడులు పెట్టిందన్నారు. అవి నింపే క్రమంలో కొందరు సొంతిళ్లు, వాహనాల విషయంలో వాస్తవాలు దాచారన్నారు. తాజా జాబితాలో అలాంటి వారు కనిపించే సరికి, వారికి రూ.10 లక్షల సాయం ఎలా చేస్తారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. ఇదే తుది జాబితా కాదని, మరిన్ని జాబితాలు ఉంటాయని వెల్లడించారు. -
జనమే గెలిపిస్తున్నరు.. ఓట్లు గుంజుకుంటున్నమా?: కేసీఆర్
‘దళిత బంధు’తో రాజకీయ లాభం కోరుకోవడం తప్పా? దళితబంధు తమాషా పథకం కాదు. ఎన్నికలున్నాయని హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పెడుతున్నారని కొందరంటున్నరు. మా పార్టీ సన్నాసుల మఠమా? మాదీ రాజకీయ పార్టీయే. టీఆర్ఎస్ అధికారంలో ఉండి, సీఎం ఉంటేనే ఇలాంటి పథకం సాధ్యం. ఏ పని చేయనోడే లాభం కోరుకుంటే.. చేసిన రాజకీయ పార్టీగా లాభం కోరుకోవడం తప్పా. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయమున్నా.. ‘దళిత బంధు’ను హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం అక్కడి ప్రజల అదృష్టం. ►రాష్ట్ర సాధన కోసం చాలా మంది మహనీయులు పనిచేశారు. 1969 నాటి ఉద్యమం తెలంగాణ సమాజానికి చాలా నేర్పించింది. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 14 సీట్లలో 11 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. తెలంగాణ కష్టపడి సాధించిన రాష్ట్రం, ఎవరూ అప్పనంగా ఇవ్వలేదు. ►ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దు. శాశ్వతంగా అధికారం ఎవరికీ ఉండదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అయిన. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా ప్రసంగం విని స్పీకర్ కౌగిలించుకున్నారు. తెలంగాణ తెచ్చుడు.. చచ్చుడు ప్రతీదానికి కేసీఆర్‌దే బాధ్యత. సాక్షి, హైదరాబాద్: ‘‘కొందరు బ్రోకర్ గాండ్లు అడ్డంపొడుగు మాట్లాడుతున్నరు. దేవుడు నోరిచ్చిండని కుక్కలు మొరిగినట్లు మొరుగుతమంటే.. ప్రజలు ఏది వాస్తవమో అవాస్తవమో గమనిస్తరు. కాకరకాయ, గీకరకాయలు అనకుంట ఎన్నికలతో లింకు లేకుంటనే.. ప్రజలకు అవసరమైన వాటితో ముందుకు వెళ్తున్నం. ప్రజలు ఆశీర్వదిస్తున్నరు. మాకు కొంతలో కొంత మంచి జరుగుతూ వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నం. మేమేమన్నా ఓట్లు గుంజుకుంటున్నమా? జనం ఓట్లు వేస్తేనే గెలుస్తున్నాం..’’ అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రజల అనుభవాలు, ఆకాంక్షల మేరకే తమ ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణభవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరారు. కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు, విపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ చెప్పిన అంశాలు, చేసిన విమర్శలు ఆయన మాటల్లోనే.. నన్ను తిట్టినట్టు ఎవరినీ తిట్టలే.. ‘‘వంకర టింకర చెప్పేటోడు అక్కడొకడు ఇక్కడొకడు ఉంటడు. తెలంగాణ కోసం జెండా ఎత్తింది మొదలు నన్ను తిట్టినట్టు ప్రపంచంలో ఎవరినీ తిట్టలేదనుకుంటా. ఎవరేమన్నా భయపడకుండా తెలంగాణ సాధించిన. ఎన్నికల రాజకీయాలు చిల్లర ముచ్చట.. ఓసారి గెలుస్తం.. మరోసారి ఓడిపోతం. కొందరు అధికారంలోకి రావడం గొప్ప విషయం అనుకుంటరు. దానికోసం ఒకడు బాగా ఒర్రుతడు. మనకు తిట్లురావా, నీ ఒక్కడికే తిట్లు వచ్చా. సంస్కర వంతులు, సంయమనం పాటించే వారు తిట్టరు. చెడు జరిగితే విమర్శిస్తారు. కానీ ప్రతిదానిని అడ్డగోలుగా వక్రీకరించి కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి ప్రతీప శక్తులు (నెగెటివ్ ఫోర్సెస్) ఎప్పుడూ ఉంటయి. అలాంటి వారి కోసం నిర్మాణాత్మకంగా పనిచేసేవారు తమ ప్రయాణం ఆపబోరు. హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ మాటామంతీ వరుసలో ఉన్నవారికి పదవులు వస్తాయి కష్టపడి సాధించిన తెలంగాణను బాగుచేసే బాధ్యత కౌశిక్‌రెడ్డి లాంటి యువకులపై ఉంది. కౌశిక్‌రెడ్డికి హామీ ఇస్తున్నా ఆయనను కేవలం హూజురాబాద్, కరీంనగర్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే అవకాశాలు వస్తాయి. ముందు నాగలి తర్వాత వెనుక నాగలి అన్నట్టుగా వరుసలో ఉన్న వారికి పదవులు ఆటోమేటిగ్గా వస్తాయి. కార్యకర్తలు కూడా ఆయన వెంట గట్టిగా ఉండాలె. పార్టీలో ఎదిగే యువతకు భవిష్యత్తు అవకాశాలు ఉంటాయి. నాయకులు ఇక్కడ నుంచే వస్తరు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు కూడా కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఉపాధి.. రక్షణ.. సాధికారత.. ఉన్నతస్థితి 'దళిత బంధు'
అదనంగా రక్షణ నిధి పథకం అమలు, పర్యవేక్షణ.. ఫలితాలను అంచనా వేయడం.. లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం.. ఈ మూడు ముఖ్యమైన అంశాలు దళిత బంధు పథకంలో ఉంటాయి. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నగదు అందిస్తారు. అదనంగా లబ్ధిదారుడు–ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబాల పరిస్థితి ఆపదల కారణంగా మళ్లీ దిగజారకుండా ఈ నిధి రక్షక కవచంగా నిలుస్తుంది. నేరుగా ఖాతాల్లోకి రూ. 10 లక్షలు కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తాం. ‘హుజూరాబాద్’లో 20,929 కుటుంబాలకు... హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586.. కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో అర్హులైనవారిని పథకానికి ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో అర్హులందరికీ వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం అమలు చేయనున్న కొత్త పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్‌లోని హుజూరాబాద్ నియోజవర్గంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత ఈ నియోజకవర్గంలోని మండలాల్లో దళిత కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం చేసి.. అర్హులను గుర్తించి, పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. ‘దళిత సాధికారత పథకం– పైలట్ ప్రాజెక్టు ఎంపిక– అధికార యంత్రాంగం విధులు’ అంశాలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే నిర్ణయించిన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకానికి ఈ ఏడాది రూ.1,200 కోట్లు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించామని.. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అదనంగా మరో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఆ నియోజకవర్గంలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దడం, మరింతగా మెరుగుపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులువు అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో కలెక్టర్లతోపాటు కొందరు అధికారులు పాల్గొంటారని.. వారితో త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రగతి భవన్లో దళిత సాధికారత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. దళిత బంధు అమలులో అలసత్వం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని సీఎం కేసీఆర్ అధికారులను హెచ్చరించారు. ‘‘పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఈ పథకం అమల్లో ముందుకు సాగాలి. మనం తినేటప్పుడు ఎంత లీనమై రసించి ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత దీక్ష కనబరుస్తామో.. దళిత బంధు పథకం అమల్లో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. కుల, ధన, లింగ భేదాలతో వ్యక్తులపై వివక్ష చూపి, ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం.. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. దళిత కుటుంబాల ప్రొఫైల్ రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాల ప్రొఫైల్ రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను అందులో పొందుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళితుల సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ అనేవిధంగా విభజించాలని సూచించారు. ఆయా సమస్యలకు అనుగుణంగా దళిత బంధు అమలు చేయాలన్నారు. హుజూరాబాద్ నుంచి ఎందుకంటే? ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారన్న వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. ‘‘సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని.. తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా చాలా వరకు కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. ఈ ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఆయన స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తేదీ, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు’’ అని తెలిపింది. చిత్తశుద్ధి, నిబద్ధత గల అధికారులు కావాలి ‘‘క్షేత్రస్థాయిలో దళిత బంధును పటిష్టంగా అమలు చేయడం కోసం.. దళితుల అభివృద్ధిపై మనసుపెట్టి నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరం. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి, దళితులపై ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించండి’’ అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. -
హుజూరాబాద్‌లో విజయం మనదే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టి సారించాలని కమలదళం యోచిస్తోంది. అందులోభాగంగా వరుస భేటీలు, వ్యూహరచనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈటల గెలుపుపై సర్వే నివేదికలు: బండి సంజయ్ హుజూరాబాద్ ఉపఎన్నికతో పాటు, ఆగస్టు 9న ప్రారంభమయ్యే బండి సంజయ్ పాదయాత్ర, ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన ప్రణాళికలు, వ్యూహాలపై అమిత్ షాతో రాష్ట్ర నాయకులు చర్చించారు. హుజూరాబాద్‌లో ఈటల తప్పకుండా గెలుస్తారని సర్వే రిపోర్టులు సైతం వచ్చాయని అమిత్ షా వ్యాఖ్యానించారని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడాలని అమిత్ షా చెప్పారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో కానీ, ముందుకానీ ఎప్పుడు బహిరంగ సభ ఏర్పాటుచేసినా రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని సంజయ్ తెలిపారు. అవినీతి, అరాచక పాలనను అంతం చేయడం కోసం క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది పలికిన ఆగస్టు 9వ తేదీన భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. గ్రామాలవారీగా పాదయాత్ర కొనసాగుతుందని, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొనేందుకు వెళ్తున్నామన్నారు. 16 నుంచి ఈటల పాదయాత్ర హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. ఈ నెల 16న కమలాపూర్ మండలం బత్తురోనిపల్లి నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభించనున్నారు. 22 రోజులపాటు నిర్వహించే పాదయాత్ర నియోజవర్గంలోని అన్ని గ్రామాల మీదుగా సాగి జమ్మికుంటలోని సైదాబాద్‌లో ముగియనుంది. -
‘హుజూరాబాద్’లో పాదయాత్ర చేస్తా: ఈటల రాజేందర్
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. కమలాపూర్ మండలంలోని బత్తినివాని పల్లె నుంచి ప్రారంభించి, 350 నుంచి 400 కిలోమీటర్లు చేస్తానని చెప్పారు. దీనిపై మరో మూడు రోజుల్లో వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని ఆయన నివాసంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక తన అభిప్రాయం కూడా తీసుకోకుండానే అరగంటలోనే ఆమోదించారని అన్నారు. రాజీనామా పత్రాన్ని తీసుకోడానికి స్పీకర్ ముందుకు రాకపోతే, అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చానని తెలిపారు. అరగంటలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఒక్క తన విషయంలోనే జరిగి ఉండొచ్చన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కానిస్టేబుల్ మొదలుకొని అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేశారని, వందల మంది ఇంటిలెజెన్స్, ఇతర పోలీస్ అధికారులను రంగంలోకి దింపారని చెప్పారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకులుగా వెలకట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కుల సంఘాల నాయకులను సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు పట్టుకుపోయి అడిగిందే తడవుగా డబ్బులిస్తున్నారని మండిపడ్డారు.ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాలతోపాటు దొంగ ఓట్ల నమోదుకు శ్రీకారం చుట్టారన్నారు. హుజూరాబాద్ ఆర్డీవో కేంద్రంగా స్పెషల్ రెవెన్యూ అధికారిని పెట్టి ఈ తతంగం జరిపిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ చైర్పర్సన్ ఇంట్లోనే 34 ఓట్లు ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారని.. పథకాలను ఆపడం ఎవరి తాత జాగీరు కాదన్నారు. ఈటల ఒంటరి వాడు కాదని, తన వెంట ఉద్యమకారులు, సంఘాలు, ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు. కమలాపూర్‌లో ఓ మహిళా అధికారిపై ఓ మంత్రి సంస్కార హీనంగా మాట్లాడారని, మంత్రులకు మతిభ్రమించి కల్లుతాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడి ఉన్నారు. -
ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారు: ఈటల
సాక్షి, కరీంనగర్: ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, రంగనాయకసాగర్‌లో బేరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆర్డీవో నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారుంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్.. టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి ఈటల ప్రయత్నించారని, అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టాలని చూశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్‌లో అభివృద్ధి జరుగుతోందని ఆయనన్నారు.