గులాబీ బాస్‌కు కొరుకుడు పడని సీటుగా హుజూరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించి కమలం గుర్తు మీద మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటలకు సరిజోడు అనుకున్న కౌశిక్‌రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్‌ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళితబంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ ఓటమితో.. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్‌చార్జ్‌గా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్‌రెడ్డిని ఆదేశించారు. అయితే, కౌశిక్‌రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే.. ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరం అవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువును తీస్తున్నారని కేసీఆర్‌కు నివేదికలందాయి.
తెరపైకి ప్రశాంత్ రెడ్డి..
కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి, పదవి ఇచ్చి, ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్‌కు ఆలోచన మొదలైంది. కౌశిక్‌రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖాన్ని తీసుకువచ్చి హుజూరాబాద్‌లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా.. కౌశిక్‌రెడ్డి, ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్‌ను కాదని.. ఓ పోలీస్ ఆఫీసర్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్‌పీగా ఉన్న పింగళి ప్రశాంత్‌రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే, అంతకుముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్‌లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట.
ఈటలకు దూరపు బంధువు..
హుజూరాబాద్‌లో ఈటలకు ధీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కుల, మతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి.. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అమలుచేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండటంతో.. ప్రశాంత్‌పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈటలకు దూరపు బంధువు కూడా అయిన ప్రశాంత్‌నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం.
తన ప్రమేయమేమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదీ తనను ఓ పొలిటీషియన్‌గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా..? లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డా.. సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది.
ఇది కూడా చదవండి: బీజేపీ ‘పరివార’ చర్చలు
Comments
Please login to add a commentAdd a comment